
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది. ఫిబ్రవరి 19– 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని సోమవారమిక్కడ తెలిపారు.
నాస్కామ్ కోర్ కమిటీ సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం తొలి సదస్సు సైతం ఇదే వేదికపై నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు.
ఆదాయం 5 బిలియన్లకు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా భావిస్తోంది. నాస్కామ్ 6–8 శాతం వృద్ధి అంచనాలను మించి తమ కంపెనీ పనితీరు కనబరుస్తుందని గుర్నాని వెల్లడించారు. ఉద్యోగుల్లో నైపుణ్యలేమి ఉందని, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 50,000 మంది సిబ్బందికి ఏడాదిలో పునర్‌శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఉద్యోగులకు పునర్‌శిక్షణ అత్యవసరమని స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా ఎంతమందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారనేది వెల్లడించకపోయినా... నికరంగా 10,000 మంది అదనంగా చేరుతారని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 1.2 లక్షలుగా ఉందని గుర్నానీ తెలియజేశారు.