
రికార్డుల రాణి.. రెండేళ్ల ఖుషీ
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఈ వండర్ కిడ్ వయసు రెండేళ్లు. అయితేనేం తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకుంది.
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఈ వండర్ కిడ్ వయసు రెండేళ్లు. అయితేనేం తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో శ్లోకాలు, పద్యాలు, ఆండ్రాయిడ్ ఫోన్‌లో పజిల్స్ పరిష్కరించడం, బొమ్మలను జత చేయడం, వివిధ రకాల జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, రంగులను గుర్తించడం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అంకెలను గుర్తించడం, జంతువుల అరుపులు చెప్పడం, వివిధ రకాల వాహనాలు, వంట సామగ్రి, జామెట్రీ వస్తువులు, శరీర భాగాలను గుర్తించడం, నవ్వడం, ఏడవడంతోపాటు అనుకరించడం వంటి వాటిలో ఖుషీ విశేష ప్రతిభను చాటుతోంది.
సానా గిరీశ్‌కుమార్, సుధతి దంపతుల కూతురు ఖుషీ(2) తన అసాధారణ ప్రతిభతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చైల్డ్ ప్రోడ్జి బిరుదు అందుకుంది. ఆదివారం మంచిర్యాలలో ఖుషీ రికార్డులను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ భారత సమన్వయకర్త బింగి నరేందర్‌గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్త జి.స్వర్ణశ్రీ పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఖుషీకి రికార్డులు ప్రకటించారు. రికార్డుల బ్యాడ్జిలు, పతకాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.