తూర్పుగోదావరిలా పాలమూరు: కేసీఆర్ | will turn palamuru into east godavari, says telangana cm kcr | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలా పాలమూరు: కేసీఆర్

Mar 29 2017 7:50 PM | Updated on Mar 22 2019 2:57 PM

వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

హైదరాబాద్‌: వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు కొత్త ప్రాజెక్టులు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా మహబూబ్‌నగర్‌ పాత జిల్లాను తూర్పు గోదావరి జిల్లాకు ధీటుగా తయారు చేస్తామని చెప్పారు.
 
కాంగ్రెస్‌కు చెందిన ఆ జిల్లా ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డి.కె.అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీధర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తదితరులు బుధవారం ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై విసృత్తంగా చర్చించారు.
 
పాలమూరు జిల్లాకున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్‌ తదితర అంశాలను ఈ సందర్భంగా సీఎం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయం నుంచి రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను కాపాడటమే తమ అభిమతమని సీఎం అన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే చాలు.
 
రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాను. తెలంగాణకు ఎక్కువ మేలు గోదావరి జలాల ద్వారా జరుగుతుంది. పాలమూరు జిల్లాకు మాత్రం నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్‌ చేశాం. ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా అపెక్స్‌ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం, అభ్యంతరాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టి తీరుతాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుంది. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు కూడా నీరందుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
‘ప్రాజెక్టుల రీ డిజైన్లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని వాడుకుంటాం. జూరాల పాయింట్‌ వద్ద గరిష్టంగా 8 టీఎంసీలు వాడుకునేందుకు మాత్రమే మనకు అవకాశముంది. కానీ శ్రీశైలం వద్ద వంద టీఎంసీల లభ్యత ఉంది. అక్కణ్నుంచి ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ఇన్‌ టేక్‌ ప్లాన్‌ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయల్‌ సాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. గత ఏడాది నీరిచ్చాం. ఈ ఖరీఫ్‌ నాటికి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూడా చేపట్టాలని నిర్ణయించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. గట్టు లిఫ్టు పనులు త్వరగా పూర్తయ్యేట్లు చూస్తాం..అని ముఖ్యమంత్రి చెప్పారు.
 
గద్వాల -మా చర్ల రైల్వే లైను
అత్యవసర గద్వాల-మాచర్ల రైల్వే లైను పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైను అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల íపీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తాం..అని ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి రావాలని నేతలను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement