సమగ్రాభివృద్ధి దిశగా వేములవాడ | Vemulawada towards development | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధి దిశగా వేములవాడ

Mar 25 2018 3:28 AM | Updated on Aug 30 2019 8:24 PM

Vemulawada towards development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం శాసనసభలో వేములవాడ పట్టణం, ఆలయ అభివృద్ధిపై కేటీఆర్‌ సమీక్షించారు. పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా వేములవాడ సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అథారిటీ పరిధిలోకి పట్టణ పరిసర ప్రాంతాలను, ముంపు గ్రామాలను తీసుకొచ్చి.. వాటన్నింటినీ వేములవాడ పట్టణ అభివృద్ధితో అనుసంధానం చేయాలని సూచించారు. పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో రానున్న ఐదు, పది, 25 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. పట్టణ జనాభా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. 

చారిత్రక వైభవాన్ని తలపించేలా.. 
దేవాలయ అభివృద్ధి డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని కేటీఆర్‌ చెప్పారు. పట్టణంలో చేపట్టే సివిల్‌ పనుల (భవనాలు, బ్రిడ్జీలు, రోడ్లు)లో చోళ–చాళుక్య శిల్ప కళా వైభవం ఉట్టిపడేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేములవాడ పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రవేశించగానే ఒక ఆలయ ప్రాంతానికి వచ్చామనే భావన కలిగేలా.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

ముఖ్యంగా విస్తరించనున్న రోడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గుడి చెరువులోకి మురికినీరు రాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్టాండ్‌ నుంచి దేవాలయం వరకు కేబుల్‌ కారు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్‌ ఆదేశించారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సులు, అందులోనూ వీలైతే ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. త్వరలో వేములవాడలో పర్యటించి.. పనులను క్షేత్రస్థాయితో పరిశీలిస్తామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement