ర్యాష్‌ డ్యాష్‌

Vehicle Over Speed on ORR Hyderabad - Sakshi

ఓఆర్‌ఆర్‌పై మితిమీరుతున్న వాహనాల వేగం

ర్యాష్‌ డ్రైవింగ్‌తో పెరుగుతున్న ప్రమాదాలు

పటాన్‌చెరు నుంచి పెద్దఅంబర్‌పేట రూట్‌లోనే ఎక్కువ

పది మాసాల్లో 86 రోడ్డు ప్రమాదాలు..

36 మంది మృతి రూ.41 కోట్ల జరిమానాలు విధింపు

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై వాహనాలు రయ్‌...రయ్‌మంటూ కంటికి కనిపించని వేగంతో దూసుకెళ్తూ తరుచుగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన ర్యాష్‌ డ్రైవింగ్‌ వాహనదారుల ప్రాణాలమీదకు తెస్తోంది. కార్ల దగ్గరి నుంచి అతి భారీ వాహనాల వరకు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్నాయి. లేజర్‌ స్పీడ్‌గన్‌లకు చిక్కి కేసులు నమోదవుతున్నా..భారీగా చలానాలు విధిస్తున్నా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రతిరోజూ లక్షా 40 వేల వాహనాలు ప్రయాణిస్తున్న ఓఆర్‌ఆర్‌లో 1388 వాహనాలకు ఓవర్‌ స్పీడ్‌ చలానాలు జారీ అవుతున్నాయి. గత పది నెలల కాలంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో 3 లక్షల 4 వేల 6 చలానాలు, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో లక్షా 12 వేల 487 చలాన్‌లు ట్రాఫిక్‌ పోలీసులు విధించారు.

ఇలా 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో 4 లక్షల 16 వేల 493 చలానాలకు రూ.41 కోట్ల 64 లక్షల 93 వేలు జరిమానాలు విధించారు. ఓఆర్‌ఆర్‌పై వాహనాల గరిష్ట వేగాన్ని 120 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్‌ జోష్‌ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ నెలవారీగా గణాంకాలు తీసుకుంటే అత్యధికంగా జూన్‌ నెలలో 55,982 మంది ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లినట్టుగా కనబడుతోంది. ఇలా ఈ ఏడాది పది నెలల్లో జరిగిన 86 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మృతి చెందారు. ఇటు ట్రాఫిక్‌ పోలీసులు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లవద్దంటూ సూచనలు చేస్తున్నా వాహనదారులు పట్టనట్టుగా వ్యవహరిస్తూ సెల్ఫ్‌గోల్‌ చేసుకుంటున్నారు. లేదా ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను చూస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు దుర్మరణం చెందడానికి కారణమవుతోంది.

మితిమీరిన వేగం వల్లే...
ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ తక్కువ ఉండటంతో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. నిద్ర లేకుండా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తుండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే మద్యం సేవించి వాహనం నడపడటంతో పాటు ఓఆర్‌ఆర్‌పై లేన్‌ డిసిప్లేన్‌ పాటించకుండా ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అధిగమిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.  – విజయ్‌కుమార్,సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top