చి‘వరి’కి వర్రీయేనా? | Varriyena civariki? | Sakshi
Sakshi News home page

చి‘వరి’కి వర్రీయేనా?

Mar 15 2015 3:49 AM | Updated on Sep 2 2017 10:51 PM

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు (కేఎస్పీ) కింద చివరి ఆయకట్టు భూములకు నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు..

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు (కేఎస్పీ) కింద చివరి ఆయకట్టు భూములకు నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.. ఏటా రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు నీరు వదలడం చివరి ఆయకట్టు భూములకు నీరందకపోయినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.  
- దేవరకద్ర
 
వాస్తవానికి రబీ సీజన్ ఆసాంతం విడతలవారీగా ఆరు తడులుగా సాగు నీటిని వదలుతారు. మధ్యలో ఐదు నుంచి వారం రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ నీటిని వదలడానికి అధికారులు షెడ్యుల్ ఖరారు చేస్తారు. అయితే నీటిని వదిలిన తర్వాత ఐదు రోజుల వరకు చివరి ఆయకట్టునకు నీరు చేరుకోని పరిస్థితులు నెలకొన్నాయి. తూములకు షెట్టర్లు లేకపోవడం వల్ల కాల్వకు దగ్గరలో ఉన్న భూములకే ఎక్కువ నీరు పారడం చివరి ఆయకట్టుకు నీరు చేరుకునే లోపే తడివదిలే సమయం అయిపోతోంది.

ఇలా ప్రతిసారి వదిలే నీటితడి తమ పొలాలకు చేరడంలేదని రైతులు వాపోతున్నారు. దేవరకద్ర మండలంలోని ఎడమ కాల్వ కింద ఎక్కువగా వరి పంటలే సాగు చేశారు. కోయిల్‌సాగర్ నీరు తడులుగా విడుదల అయినప్పుడు నీటి వాడుకోవడం తూములు మూసిన విరామ సమయంలో బోరుబావుల ద్వార నీటిని పంటలకు పారిస్తూ వరి పంటలను పండిస్తున్నారు. ఈసారి రబీ సీజన్‌లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మండలంలోని కోయిల్‌సాగర్, నాగన్నపల్లి, చిన్నరాజమూర్, పెద్దరాజమూర్, నాగారం, బస్వాపూర్, నార్లోనికుంట్ల, బల్సుపల్లి పరిధిలో పెద్ద ఎత్తున పంటలు వేశారు.
 
ప్రస్తుత పరిస్థితి ఇలా..
ఈ కాల్వ కింద ఐదు రోజుల పాటు నీటిని వదిలిన తర్వాత ఈనెల 12న తూములను మూసివేశారు. అయితే అప్పటివరకు నాగారం శివారు వరకు మాత్రమే నీరు విడుదలైంది. నార్లోనికుంట్ల, బస్వాపూర్, బల్సుపల్లి, గూరకొండ ప్రాంతాలకు నీరందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు విషయం తెలిపినా ఫలితంలేకపోయింది. చివరకు రైతులంతా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు పిలిచి మాట్లాడారు.

కొత్తగా వచ్చిన అధికారులు కావడం వల్ల ఎన్ని రోజులకు ఏ తూము వరకు నీరు చేరుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. తూము నుంచి 28 ఇంచుల నీటిని వదలడం వల్ల చివరి ఆయకట్టుకు నీరందదని అలాగే కాల్వ మధ్యలో నాగారం, బస్వాపూర్ చెరువులు ఉన్నాయని అవి నిండితేనే చివరి ఆయకట్టుకు నీరందుతుందని నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు వివరించారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి 60 ఇంచుల పైకి తూమును తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే చివరి ఆయకట్టుకు నీరందడానికి రెండు రోజులు పట్టవచ్చని రైతులు తెలిపారు.
 
చేపలు పట్టడానికేనా?
ఇటీవల ఒకవైపు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని కాల్వల ద్వారా వదులుతుండగా మరోవైపు జూరాల బ్యాక్‌వాటర్ కృష్ణానది నుంచి ఎత్తిపోతల ద్వాదా నీటిని పంపింగ్ చే స్తూ కేఎస్పీకి నీటిని అందిస్తూ వచ్చారు. నాలుగు రోజులుగా మత్స్యకారులు చేపలు పట్టడం ప్రారంభించడంతో కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలడం నిలిపి వేసినట్లు తెలిసింది. దీనివల్లే రైతులు ఆందోళన చెందడంతో తిరిగి నీటిని వదిలారు. అయితే జూరాల బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటి పంపింగ్‌ను మాత్రం నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement