బీజేపీకి అభ్యర్థులు లేరు

V Srinivas Goud Comments On BJP Party Over Municipal Elections - Sakshi

రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దయనీయం

మా పార్టీ రెబెల్స్‌కోసం వెతుకుతున్నారు

మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌ విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ దయనీయమైన పరిస్థితని, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు సైతం దొరకడం లేదని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. తాము టికెట్‌ ఇవ్వని రెబెల్‌ అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతోందని, ఎక్కడైనా అభ్యర్థులుంటే అక్కడ పార్టీ నేతలు టికెట్టు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. వంద మున్సిపాలిటీల్లోనూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చందర్, జెడ్పీ చైర్మన్‌ పుట్టా మధుతో కలసి మంత్రులిద్దరూ ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పగటికలలు కంటోందని, అవి సఫలం కావని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు మాట్లాడారని, చివరకు స్వయంగా ఆయనే ఓడిపోయారన్నారు. బీజేపీ అతిగా ఊహించుకుంటుందని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలతో ఓటర్లు నవ్వుకుంటున్నారన్నారు. మరో 20 ఏళ్లు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో సెంటిమెంట్‌తో బీజేపీకి ఓట్లు వేసిన వారు ఇప్పుడు ప్రశ్చాత్తాప పడుతున్నారని, జెడ్పీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లో రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత తమకు దక్కుతుందని, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ అన్ని జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అన్ని పట్టణాల అభివృద్ధికి తమ వద్ద ప్రణాళికలున్నాయని, బీజేపీ గెలిచినా చేసేదేమీ ఉండదన్నారు. ఆరేళ్ల తమ పాలన గత ప్రభుత్వాల పాలన కన్నా ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top