ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయండి | Uttam Kumar Reddy And Batti Vikramarka Letter To KCR | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయండి

Apr 23 2019 1:49 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy And Batti Vikramarka Letter To KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలని.. ఇందుకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి, సంబంధిత అధికారులను బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అనుభవజ్ఞుల సూచనలతో ఇంటర్‌బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం వారు బహిరంగ లేఖ రాశారు. ‘జాగ్రఫీ విద్యార్థులకు సంబంధించిన మార్కులు మెమోల్లో కనిపించడం లేదు. సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులకు మొత్తం మార్కులకు తేడాలున్నాయి. ఫస్టియర్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు సెకండియర్‌లో ఫెయిలయ్యారు. 90 మార్కులొస్తే మెమోలో సున్నా మార్కులు ముద్రించారు. రోజూ 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారు.

ఇలా అనేక అవకతవకలతో ఇంటర్‌ విద్యార్థులు నష్టపోయారు. అవినీతిని ప్రక్షాళన చేస్తామంటూ అనేక ప్రగల్భాలు పలుకుతున్న మీరు ముందు ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాలి. దాదాపు పది లక్షల కుటుంబాలు ఎదురు చూసే అత్యంత కీలకమైన ఇంటర్‌ ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇలాగేనా..?’అని సీఎంను ప్రశ్నించారు. బోర్డు అధికారులు తప్పులు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అస్సలు పట్టనట్టు సీఎం వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. కనీసం బోర్డు అధికారులను పిలిపించి పరిశీలించిన దాఖలాల్లేవని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుండెలు మండి ఏడుస్తుంటే, ఇంటర్‌ బోర్డు ముందు ఆందోళనలు చేస్తుంటే అధికారులు స్పందిస్తున్న తీరు హేయంగా ఉందన్నారు. పూర్తిస్థాయిలో రీకౌంటింగ్‌ జరపాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement