కరీంనగర్‌ బరిలో ఇద్దరు బీజేపీ రెబెల్స్‌ 

Two BJP Rebels in Karimnagar - Sakshi

సుగుణాకర్‌రావును పోటీలో దింపాలని కోర్‌ కమిటీ నిర్ణయం 

ఓటర్ల నమోదులో చురుకుగా వ్యవహరించిన రణజిత్, ఎడ్ల రవి  

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి రెబెల్స్‌ బెడద తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి ఏకంగా ఇద్దరు రెబెల్స్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రణజిత్‌ మోహన్, సుగుణాకర్‌ రావు, బీజేవైఎం నేత, అధికార ప్రతినిధి, న్యాయ వాది ఎడ్ల రవికుమార్‌ పటేల్‌ పోటీలో ఉన్నారు. అయితే ఈ స్థానం నుంచి సుగుణాకర్‌రావును పోటీకి దింపాలని బీజేపీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. దీంతో రణజిత్‌ మోహన్, ఎడ్ల రవి రెబెల్స్‌గా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ స్థానం పరిధిలో బీజేపీ ఐక్యం గా నిలిస్తే గెలిచే అవకాశాలున్నా ఆ పార్టీకి చెందిన వారు ముగ్గురు బరిలో నిలుస్తుండటంతో ఓట్ల చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరితో మాట్లాడే బాధ్యతను కోర్‌ కమిటీ ఎంపీ బండారు దత్తాత్రేయ కు అప్పగించింది. పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీలో మంచి పదవి ఇస్తామని రణజిత్‌ మోహన్‌కు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నచ్చజెప్పే ప్ర యత్నం చేసినా  ఒప్పుకోలేదు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఓటర్ల నమోదులోనూ రణజిత్, ఎడ్ల రవి చురుకుగా వ్యవహరించారు. వేల సంఖ్యలో కొత్త ఓటర్లను నమోదు చేయడంతో ఆయా వర్గాలమద్దతు పొందవచ్చుననే ఆశాభావంతో వారుఉన్నారు.  

రణజిత్‌కు ఆరెస్సెస్‌ అండ.. 
రణజిత్‌ మోహన్‌కు ఆరెస్సెస్‌లోని వివిధ శాఖలు, సరస్వతి విద్యాపీఠాలు, శిశుమందిర్‌ ఏబీవీపీ, బీఎంఎస్‌ పూర్వ విద్యార్థులు మద్దతు తెలుపుతు న్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతా ల్లో తాము బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపడం లేదని, రణజిత్‌కే తమ మద్దతు అంటూ ఆయా విభాగాలు తీర్మానాలు కూడా చేసినట్టు సమాచారం.  

బీజేవైఎం నుంచి రవి.. 
ఈ ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే యువకుడిగా, యువకుల గొంతుకగా నిలుస్తా... అని ఓటర్లకు ఎడ్ల రవి విజ్ఞప్తి చేశారు.  నామినేషన్‌ వేశాక రవి మాట్లాడుతూ బీజేపీలో చిన్న కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభమైందని, బీజేవైఎం అధికార ప్రతినిధిగా పని చేస్తున్నానని, బీజేవైఎం నేతగా, అడ్వొకేటుగా తనకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఎడ్ల రవికి ఈ జిల్లాల్లోని యువమోర్చా కార్యకర్తలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top