నీళ్లివ్వనప్పుడు ఓట్లెందుకు వేయాలి’

Tribes protest in medak - Sakshi

హవేళిఘణాపూర్‌ (మెదక్‌): ‘తాగేందుకు నీళ్లివ్వనప్పుడు.. ఓట్లెందుకు వేయాలి.. గుక్కెడు నీటి కోసం పొలాల్లో బోర్ల వెంట తిరుగుతూ అల్లాడిపోతున్నాం.. అయినా మా బాధలు పాలకులకు పట్టావా’అంటూ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్‌జిల్లా హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ తండాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం ముగించుకొని మెదక్‌ వైపు వెళ్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి వాహనాలకు గిరిజనులు అడ్డుతగిలారు.

రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలను ఉంచి తండావాసులు నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తమ తండాను పట్టించుకున్న నాథుడు లేడని వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రం తండాలు, గిరిజనులు గుర్తుకు వస్తారని, గెలిచాక మాత్రం పాలకులు తమ తండాలవైపు కన్నెత్తి కూడా చూడరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఖాళీ బిందెలు, బకెట్లను తీసివేయాలంటూ కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు గిరిజనులతో వాగ్వాదానికి దిగారు. గిరిజనులు ఎంతకూ ఖాళీ బిందెలను తీయకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకులే బిందెలను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం గిరిజనులను సముదాయించి రెండు రోజుల్లో నీళ్లు వచ్చేలా చేస్తామని హామీనిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top