గిరిపుత్రుడి సాహస యాత్ర

Trecker Chinni Krishna Waiting For Helping Hands - Sakshi

కిలిమంజారోపై చిన్నికృష్ణ విజయహాసం

రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతారోహణ చేసే అవకాశం

ఆర్థిక చేయూత అందివ్వాలని వినతి

బంజారాహిల్స్‌: కొందరు అటు చదువులోనో, ఇటు క్రీడల్లోనో రాణిస్తుంటారు. మరికొందరు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ రెండింటితో పాటు మరిన్ని నైపుణ్యాలపై ప్రతిభను చాటేవారు కొందరే ఉంటారు. ఆ కోవలోకి చెందాడు ఈ గిరిజనపుత్రుడు. పర్వతారోహణమే కాకుండా కరాటే, జానపదగేయ రచయిత, గాయకుడు, స్టిక్‌ ఫైటర్, ఫిట్టింగ్‌ మాస్టర్, నటుడు, డాన్సర్‌ ఇలా అన్ని కలిపితే ఈ చిన్నికృష్ణ నాయక్‌ అవుతాడు. పుట్టింది గిరిజన తండాలో.. తల్లిదండ్రులది సాధారణ రైతు కుటుంబం.. కుటుంబ పోషణ అంతంత మాత్రమే.. అయితేనేం.. ఆ యువకుడు తాను అనుకున్నది సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఔరా.. అనిపించుకుంటున్నాడు ఈ గిరిపుత్రుడు.

అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రామావత్‌నారాయణస్వామి నాయక్‌ కొడుకు రామావత్‌ చిన్నికృష్ణనాయక్‌(26) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీపీఎడ్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–14లోని లంబాడి బస్తీలో ఉంటున్న చిన్నికృష్ణనాయక్‌కు పర్వతారోహణ అంటే అమితాసక్తి. 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అలవోకగా గుట్టలెక్కేవాడు. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. గతేడాది నవంబర్‌ 13న కిలిమంజారో పర్వతారోహణ చేసి రికార్డు సృష్టించాడు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనక్‌ పర్వతాన్ని అధిరోహించాడు. జమ్మూకాశ్మీర్‌లోని తులియన్సిక్‌ పర్వతారోహణ చేశాడు. అదే ప్రాంతంలోని మరో ఎత్తైన పర్వతం బైసరన్‌ అధిరోహించాడు. ఈ లక్ష్యాలన్నీ సాధించిన తర్వాత కిలిమంజారో పంపించడం జరిగింది. ప్రత్యేక శిక్షణ ద్వారా 40 మందిని ఎంపిక చేయగా అందులో కృష్ణ 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా రష్యాలో పర్వతారోహణ చేసే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. జులై 20వ తేదీన రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆయనకు లేఖ రాశారు. చిన్నికృష్ణనాయక్‌ కేవలం పర్వతారోహణమే కాకుండా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందేల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. 

ఆర్థిక సాయం కావాలి..
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో బతుకుతున్న చిన్నికృష్ణనాయక్‌కు రష్యాలో ఎల్‌బ్రోస్‌ పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. దేశంలో ఈ అవకాశం దక్కిన  అతికొద్ది మందిలో కృష్ణ కూడా ఒకరు. అయితే.. ఇక్కడికి వెళ్లడానికి సుమారుగా రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 83744 34274 నెంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నాడు. ఈ పర్వతారోహణ చేసి భారతదేశ కీర్తిని దశదిశలా చాటుతాని పేర్కొంటున్నాడు. తనకు ఆర్థిక అండ అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top