మేము ఓటేస్తాం.. మీరూ వేయండి

Transgenders Rally On Vote Right In Warangal - Sakshi

ఓటరు అవగాహన ర్యాలీలో హిజ్రాలు

వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ

ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించిన ట్రాన్స్‌జెండర్స్‌

హన్మకొండ చౌరస్తా: ‘మాకు సైతం ఓటు హక్కు కావాలని కొట్లాడి సాధించుకున్నాం.. అందుకే ఎన్నికల్లో సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులకోం.. మీరు సైతం ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి’ అంటూ ట్రాన్స్‌జెండర్స్‌ పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్‌ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగిన ఈ చైతన్య ర్యాలీలో ప్లకార్డులు, నినాదాలు చేస్తూ సుమారు 300 మంది హిజ్రాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారుడు ప్రొఫెసర్‌ పర్చా కోదండ రామారావు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మంచి నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్‌ మాట్లాడుతూ హిజ్రాలను సమాజం చిన్నచూపు చూస్తున్నప్పటికీ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటున్నారని ప్రశంసించారు. ఓటుకు దూరంగా ఉండే వ్యక్తులు హిజ్రాలను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్‌ సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది, దీనిని డబ్బు, మద్యంతో వెలకట్టలేమని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్‌ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు గౌతమి, కోశాధికారి రజిత, సుధా, స్నేహా, జ్వాల సంస్థ సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, కీత రాజ్‌కుమార్, వాంకె నర్సింగరావు, నిజాం తదితరులు పాల్గొన్నారు.

ఓటు వేయడం మానుకోలేదు..
2006కు ముందు వరకు మాకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. విద్యావంతులు, యువత స్పందించి అందరూ ఓటు వేసేలా చైతన్యం కల్పించాలి. నూటికి 99శాతం మంది ఓటును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడు పుట్టుకొస్తాడు. మాలో ఉన్నత విద్య చదివిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ అర్హత ప్రకారం ప్రభుత్వ శాఖక్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
స్నేహ, వరంగల్‌

నాయకుల ప్రలోభాలకు గురికాము..
మాకు ఓటు హక్కు లేనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 2006 నుంచి ఇప్పటి వరకు శాసనసభ, లోక్‌సభ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాలుగు సార్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. మాకు ఓటు ఉందని తెలిసిన అనేక మంది నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. కానీ మా సమస్యలను ఎవరు గుర్తించి పరిష్కరిస్తారని నమ్మకం ఉన్న నేతలకే స్వచ్ఛందంగా ఓటు వేస్తాం. మేము బతకడానికి అడుక్కుంటాము గానీ ఓటును అమ్ముకోం. 
రేష్మ, వరంగల్‌

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top