మూసీలో ట్రాక్టర్‌ బోల్తా.. 15మంది మృతి

Tractor Falls into Mussi Canal, 14 people killed In Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి : పేద కుటుంబాల్లో పెనువిషాదం అలుముకుంది. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీలను మృత్యువు కబళించింది. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి మూసీ కాలువలో బోల్తా పడింది. వలిగొండ సమీపంలోని లక్ష్మాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 14మంది పెద్దవాళ్ళు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు విలపించిన తీరు వర్ణణాతీతం. మృతులంతా వేములకొండ గ్రామానికి చెందినవారు. వీరిలో తల్లీకొడుకు, తల్లీకూతురులు కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.

మృతుల వివరాలు..
కడింగుల లక్ష్మీ, లక్ష్మి కూతురు అనూష, ఇంజమురి లక్ష్మమ్మ, ఇంజమురి శంకరమ్మ, అంబల రాములమ్మ, చుంచు నర్మదా, కందల భాగ్యమ్మ, ఏనుగుల మాధవి, జడిగి మరమ్మ ,పంజల భాగ్యమ్మ, బిసు కవిత, బంధారపు స్వరూప,గానే బోయిన అండలు, అరూర్ మణెమ్మ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన తల్లీ కొడుకులు ఉన్నట్లుగా గుర్తించారు. 

యాదాద్రి ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..
యాదాద్రి జిల్లా ట్రాక్టర్‌ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

వలిగొండ ప్రమాదంపై గట్టు శ్రీకాంత్‌ రెడ్డి దిగ్ర్భాంతి..
వలిగొండ ట్రాక్టర్‌ ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అంతేకాక క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గట్టు శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రమాదంపై మంత్రి జగదీష్‌ రెడ్డి దిగ్భాంత్రి
వలికొండ ట్రాక్టర్‌ ప్రమాదంపై మంత్రి జగదీష్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోనగిరి- యాదాద్రి జిల్లాల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌, డీసీపీలతో ఫోన్‌లో సమీక్షించారు. అంతేకాక సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్‌ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ విధమైన సంఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగా​త్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి జగదీష్‌ రెడ్డి సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top