ఊట బావుల ఊరు.. | The different water problem in venkatapur | Sakshi
Sakshi News home page

ఊట బావుల ఊరు..

May 10 2017 12:43 AM | Updated on Sep 5 2017 10:46 AM

ఊట బావుల ఊరు..

ఊట బావుల ఊరు..

జలం కోసం జనం పరితపిస్తున్న రోజులివి. భానుడి విశ్వరూపానికి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు.

బావులు తవ్వితే నీళ్లు.. బోర్లు వేస్తే చుక్క రాదు
- మహబూబ్‌నగర్‌ జిల్లా వెంకటాపూర్‌లో చిత్రమిది!
- ఈ మర్మమేమిటో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు

సాక్షి, మహబూబ్‌నగర్‌:
జలం కోసం జనం పరితపిస్తున్న రోజులివి. భానుడి విశ్వరూపానికి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామం ఇందుకు భిన్నం. ఇక్కడి వ్యవసాయ పొలాల దగ్గర బోర్లు డ్రిల్లింగ్‌ చేస్తే చుక్క నీరు రాదు. అదే స్థానంలో బావులను తవ్వితే మాత్రం పుష్కలమైన నీరు లభిస్తుంది. 20 అడుగులు తవ్వితే చాలు.. నీరు ఉబికి వస్తోంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో ఆ గ్రామంలో బోర్లు వేయడం మానేసి ప్రతిఒక్కరూ బావులు తవ్వుకుంటున్నారు.

మొదట 20 బావులతో మొదలైన ప్రస్థానం.. ప్రస్తుతం 130 బావులకు చేరింది. ఇంతటి వేసవిలో కూడా ప్రతీ బావి నిండుకుండలా నీటితో కళకళలాడుతుంటుంది. ఇంటింటికి వ్యవసాయం.. ఇంటింటికి బావి ఉండటంతో ఈ గ్రామం సిరుల పంటలకు నిలయంగా మారింది. ఇదే గ్రామానికి పక్కనే ఉన్న తీలేరు, పెద్ద చింతకుంట, బం డ్రవల్లిలలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. మరో పక్క ఈ భిన్నమైన పరిస్థితులకు మూల కారణంపై భూగర్భజలశాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.

ఇదో ప్రత్యేకత...
మరికల్‌ మండలం తీలేర్‌ గ్రామ పంచాయతీకి అనుబంధమైన గ్రామమే వెంకటాపూర్‌. 1950లో పది కుటుంబాలతో గ్రామంగా ఏర్పడిన వెంకటాపూర్‌కు 750ఎకరాల శివారుంది. బావి తవ్విన ప్రతిచోట పుష్కలమైన నీరు రావడంతో కాలక్రమంలో గ్రామం విస్తరించిం ది. మొదట 20 బావులతో మొదలైన వెంకటాపూర్‌ బావుల ప్రస్థానం ఏటా పెరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబానికి ఒక బావి ఉండటంతో  తమ పొలాల్లో వరి, వేరుశనగ, తోటలను సాగు చేసుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు బావుల్లో సంవత్సరం పొడువునా నీరు ఉండడంతో చేపల పెంపకం చేపడుతున్నారు. ఇలా రెండు విధా లా రైతులకు లాభసాటిగా మారుతోంది.

15 నుంచి 20 అడుగుల్లోనే నీరు
పాలమూరు ప్రాంతమంటే సరైన వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతుండడం మనం చూస్తుంటాం. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలా దారుణంగా భూగర్భజలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక దాదాపు 500 అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వెంకటాపూర్‌ గ్రామం ఇందుకు భిన్నంగా ఉంది. బోర్లు వేస్తే చుక్కనీరు పడకపోయినా.. బావులు తవ్వితే అది కూడా 15 నుంచి 20 అడుగుల లోతులో పుష్కలమైన నీరు అందుతోంది.  

పరిశోధన చేస్తున్నాం
వెంకటాపూర్‌ గ్రామ ప్రత్యేక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. కేవలం బావులలో మాత్రమే నీరు రావడానికి కొన్ని పరిస్థితులుంటాయి. భూమిలో అనేక పొరలుంటాయి. నీటిని భూమిలోకి పూర్తిగా ఇంకకుండా వెదడ్‌ (ప్రత్యేక పొర), హార్డ్‌రాక్‌ వంటి పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లరేగడి పొర ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని విడుతూరులో కూడా ఉంది. అయినా వెంకటాపూర్‌ గురించి పరిశోధన చేస్తున్నాం. పూర్తి నివేదిక రాగానే అందజేస్తాం.
    –  కె.లక్ష్మణ్, భూగర్భ జల అధికారి, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement