45.4 డిగ్రీలు

Temperature Rising In Telangana - Sakshi

ఆదిలాబాద్‌కల్చరల్‌: భానుడి ఉగ్రరూపంలో జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. వారం రోజులుగా రాష్ట్రంలో ఈదురుగాలులు, అకాల వర్షాలు, చిరుజల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొంది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరుకుంది. శుక్రవారం సైతం 45.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. సూర్యోదయం నుంచే ఎండవేడిమి మొదలవుతోంది. దీంతో ఉదయం 10 గంటల తర్వాత బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం ఇక చెప్పనవసరం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీనికితోడు భరించలేని ఉక్కపోత, వడగాలులు వీస్తుండటంతో జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే ఇంత వేడిమి ఉంటే మే నెలలో ఇంక ఎలా ఉంటుం దోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు వడగాలుల తీవ్రత ఎక్కువయ్యే అవకాశమున్నందున ఎండలో తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
జనం ఉక్కిరిబిక్కిరి
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం పదిరోజులు నుంచి ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 45.4 డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 గంటలు దాటిందంటే భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటినా వేడి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45.4 డిగ్రీలు దాటే అవకాశముంమదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం నెలకొంటుంది.

ఈసారి వర్షాలు మోస్తరుగా కురిసినా చలి తీవ్రత ఎక్కువగా నమోదైంది. జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి టి గ్రామంలో అత్యల్ప స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగత్రగా నమోదైంది. ఎండలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి. భానుడి భగభగతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భూమి వేడి సెగలు కక్కుతోంది. వేడి గాలులు ధడ పుట్టిస్తున్నాయి. కాగా శుక్రవారం జిల్లాలో రికార్డుస్థాయిలో 45.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఎండలో పనిచేసేవారు. పనిమీద బయట తిరిగేవారు, వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండ  తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువ సేపు పనిచేయకూడదు. ఒకవేళ అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు నెత్తిన టోపితోపాటుగా ముఖానికి వస్త్రం చుట్టుకోవడం మేలంటున్నారు. గొడుగు వెంట తీసుకెళ్లడంతోపాటు తరచుగా గ్లూకోజ్, ఎలక్ట్రాల్‌ ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ కాకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top