ఇదేం ప్రజాస్వామ్యం ! | telugu desam party government program change into private program | Sakshi
Sakshi News home page

ఇదేం ప్రజాస్వామ్యం !

Jul 19 2014 3:06 AM | Updated on Sep 2 2017 10:29 AM

ప్రభుత్వ కార్యక్రమాన్ని సొంత పార్టీ కార్యక్రమంలా మార్చేశారు తెలుగు తమ్ముళ్లు.. అధికారికంగా గెలిచిన వార్డు కౌన్సిలర్‌ను కాదని.. ప్రత్యేకంగా వేరే వీధిలో మరొక వార్డు సభ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు.

సత్తుపల్లి: ప్రభుత్వ కార్యక్రమాన్ని సొంత పార్టీ కార్యక్రమంలా మార్చేశారు తెలుగు తమ్ముళ్లు.. అధికారికంగా గెలిచిన వార్డు కౌన్సిలర్‌ను కాదని.. ప్రత్యేకంగా వేరే వీధిలో మరొక వార్డు సభ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. ఈ సంఘటన సత్తుపల్లి నగరపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో శుక్రవారం చోటు చేసుకుంది. అధికారికంగా నిర్వహించాల్సిన చోట కాకుండా మరో చోట సభ ఏర్పాట్లు చేయడం పట్ల వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కౌన్సిలర్ తోట సుజలారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు.

 ‘వార్డు కౌన్సిలర్ లేకుండా వేరేచోట సభ ఎలా నిర్వహిస్తారు..? ఇది అధికారిక కార్యక్రమమా..? పార్టీ కార్యక్రమమా..? మేము ప్రజల ఓట్లతోనే గెలిచాం.. ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్లు గెలిచిన చోట ఈ విధంగానేనా వ్యవహరించేది.. ఇన్‌చార్జ్ కమిషనర్ బి.వందనం పక్షపాతంగా వ్యవహరించి అక్కడ కూడా నగరపంచాయతీ సిబ్బందితో టెంట్, కుర్చీలు వేయించారు’ అని ఆమె ఆరోపించారు.

ఇదెక్కడి న్యాయమని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ టెంటుకు, తనకు ఏం సంబంధం లేదని, అధికారిక కార్యక్రమం ఇక్కడే జరుగుతుందని వందనం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి టెంటు తొలగించే వరకు సభ జరగనీయమంటూ సుజలారాణి అధికారులకు తేల్చి చెప్పటంతో సుమారు గంటసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆమె జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 వివాదానికి కారణమేంటీ..
 ‘మనవార్డు-మన ప్రణాళిక’లో భాగంగా 5వ వార్డులో తోట వెంకటరావు వీధిలో అధికారికంగా కౌన్సిలర్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వార్డుల్లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. అయితే టీడీపీ పట్టణ అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ చల్లగుండ్ల కృష్ణయ్య పక్కనున్న రాజబాపయ్య వీధిలో ఓ టీడీపీ కార్యకర్త ఇంటి ఎదుట టెంటు వేసి ఇక్కడే ‘మనవార్డు-మనప్రణాళిక’ సభ జరుగుతుందని.. నగరపంచాయతీ చైర్‌పర్సన్ ఇక్కడికే వస్తారని అంటూ దరఖాస్తులు స్వీకరించే ఏర్పాటు చేశారు.

 దీనిపై 5వ వార్డు కౌన్సిలర్ తోట సుజలారాణి జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తహశీల్దార్ బి.మల్లయ్య, ఇన్‌చార్జ్ కమిషనర్ బి.వందనంకు ఈ అనధికారిక సభను రద్దు చేయాలని కోరుతూ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. దీంతో చేసేదేమీలేక టెంట్ తొలగించాలనిఇన్‌చార్జ్ కమిషనర్ పోలీసులకు సూచించారు. ఆ తర్వాత సత్తుపల్లి ఎస్సై నాగరాజు రాజబాపయ్య వీధిలో టెంటు వేసి ఉన్న ప్రదేశానికి వెళ్లి.. ‘ప్రభుత్వ కార్యక్రమానికి పోటీగా ఇతర కార్యక్రమం నిర్వహించకూడదు.. తక్షణం టెంటు, కుర్చీలను తొలగించా’లని కృష్ణయ్యను హెచ్చరించడంతో విధిలేక టెంటును తీసివేశారు.

 ప్రజల్లో అయోమయం...
 మనవార్డు-మనప్రణాళిక వార్డు సభలకు రెండుచోట్ల టెంట్లు వేయటంతో  ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. టీడీపీ నిర్వహించిన అనధికారిక సభలో కూడా కొందరు దరఖాస్తులు ఇచ్చారు.

 సొంత కార్యక్రమమా... :  టీఆర్‌ఎస్ నేతల ప్రశ్న
 20వ వార్డులో మనవార్డు-మన ప్రణాళిక సభలో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. టీఆర్‌ఎస్ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఎస్‌కె అయూబ్‌పాషా వార్డు ప్రణాళిక సభల్లో సీఎం ముఖచిత్రం, తెలంగాణ అధికారిక ముద్ర లోగోతో కూడిన ఫ్లెక్సీ పెట్టకపోవటం పట్ల ఇన్‌చార్జ్ కమిషనర్ బి.వందనంను నిలదీశారు.

 ప్రభుత్వ కార్యక్రమమా.. సొంత కార్యక్రమమా.. ఫ్లెక్సీ పెట్టే డబ్బులు కూడా లేవా.. సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన ప్లెక్సీలు ఎందుకు పెట్టలేదంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు ఏమీ రాలేదని.. సొంత డబ్బులతోనే ఈ సభలు నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఏమీ అందలేదని.. ఇన్‌చార్జ్ కమిషనర్ బి.వందనం చెప్పారు. కాగా, వేదికపై టీడీపీ నేతలు కూర్చోవటంతో ఇది ఆ పార్టీ కార్యక్రమాన్ని తలపించిందని పలువురు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement