చెక్‌పవర్‌ ఏదీ?

Telangana State Panchayat Funding Shortages - Sakshi

పాపన్నపేట (మెదక్‌) : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉండాలి. కానీ పదవి చేపట్టి రెండు నెలలు గడిచినా చెక్‌ పవర్‌పై స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నిధులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు జనాభా ప్రాతిపదికన రూ.17,12,71,000 పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి.

నిధులు మంజూరైనా .. చెక్కుపై రెండో సంతకం ఎవరు పెట్టాలన్న విషయంపై ఇంతవరకు స్పష్టత లేక పోవడంతో చిక్కు వచ్చి పడింది. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. 2018 జూలై నాటికి పాత సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పట్లో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్పెషల్‌ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది.  జనవరి 2019లో గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు.

చెక్కుపై రెండో సంతకమే చిక్కు ..
2018 ఏప్రిల్‌ కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వాలన్న నిబంధనలు పొందు పరిచారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త నిబంధన అమలు కాదని అదే నెలలో సర్కార్‌ ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు ఎప్పటి మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల జాయింట్‌ చెక్‌ పవర్‌ అమలు చేయాలని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోయినా పంచాయతీ నిధుల నుంచి రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్‌లు వాపోతున్నారు.

నిధుల వరద.. తీయలేమనే బాధ
ఈఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.17,12,71,000 మంజూరయ్యాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలుండగా 7,67,428 జనాభా ఉంది. ఒక్కొక్కరికి రూ.259 చొప్పున నిధులు సంబంధిత పంచాయతీ ఖాతాల్లో పడ్డాయి. ఈ మేరకు వీటి నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా, మోటార్ల కొనుగోలు, రిపేర్లు, వీధి దీపాల నిర్వాహణ, కొనుగోళ్లు, అంతర్గత రోడ్లు తదితర పనులు చేపట్టొచ్చు. ఎండలు మండుతుండడంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది.

మురికి కాల్వలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు అత్యవసరం కావడంతో చాలామంది సర్పంచ్‌లు సొంతంగా ఖర్చు చేసి పనులు చేయించారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో 2018లో స్పెషల్‌ ఆఫీసర్లు పదవీ బాధ్యతలు చేపట్టగానే అదే సంవత్సరం ఆగస్టులో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఒక ఉత్తర్వు ఇస్తూ.. ప్రత్యేక అధికారి, కార్యదర్శి సంతకాలను అనుమతించా లంటూ స్పష్టత ఇచ్చారని సర్పంచ్‌లు అంటున్నారు. ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అప్పటి లాగానే సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు అవకాశమివ్వాలని  కోరుతున్నారు. గత మార్చి తోనే ఆర్థిక సంవత్సరం ముగిసినందున అప్పు చేసి పనులు చేసిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.

స్పష్టత ఇవ్వాలి 
సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షల పనులు చేపట్టాం. చెక్కు వివాదంతో బిల్లులు రావడం లేదు. పంచాయతీరాజ్‌ శాఖ స్పందించి ఏదో ఒకటి తేల్చాలి. వేసవి కాలం కావడంతో తాగునీటి సరఫరాపై ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఇబ్బంది కలుగకుండా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. – పి.బాపురెడ్డి, సర్పంచ్, మల్లంపేట

త్వరలోనే పరిష్కారం.. 
గ్రామ పంచాయతీ చెక్కుపై జాయింట్‌ పవర్‌ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. అందుకే బిల్లులు పాస్‌ కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఏర్పడింది. దానికనుగుణంగా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. – హనూక్, జిల్లా పంచాయతీ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top