2025 నాటికి క్షయరహిత తెలంగాణ

Telangana Should be Tuberculosis Free Says Governor Tamilisai - Sakshi

గవర్నర్‌ తమిళిసై పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను 2025 నాటికి క్షయ రహిత రాష్ట్రంగా మార్చాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని క్షయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 70వ టీబీ సెల్‌ క్యాంపెయిన్‌ను శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షయ నియంత్రణ కోసం చేపట్టే పరిశోధన చాలా ఖరీదైందని, అందువల్ల 2025 నాటికి నూటికి నూరు శాతం తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా మార్చడానికి కార్పొరేట్‌ రంగ భాగస్వామ్యం, సాయం అవసరమని పేర్కొన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ భయంకరమైన వ్యా«ధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రివైజ్డ్‌ నేషనల్‌ టీబీ కంట్రోల్‌ ప్రోగ్రాం కింద అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యులు సూచించినట్లు క్షయ రోగులు నిరంతరం చికిత్స తీసుకోవాలని, ఈ మేరకు క్షయ సంఘాలు చర్యలు చేపట్టాలన్నారు. క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యలకుగాను తెలంగాణ క్షయ సంఘాన్ని గవర్నర్‌ ప్రశంసించారు. అనంతరం విజేతలకు అవార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి తెలంగాణ క్షయ సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top