breaking news
tuberculosis treatment
-
2025 నాటికి క్షయరహిత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను 2025 నాటికి క్షయ రహిత రాష్ట్రంగా మార్చాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని క్షయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 70వ టీబీ సెల్ క్యాంపెయిన్‌ను శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షయ నియంత్రణ కోసం చేపట్టే పరిశోధన చాలా ఖరీదైందని, అందువల్ల 2025 నాటికి నూటికి నూరు శాతం తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా మార్చడానికి కార్పొరేట్ రంగ భాగస్వామ్యం, సాయం అవసరమని పేర్కొన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ భయంకరమైన వ్యా«ధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కింద అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యులు సూచించినట్లు క్షయ రోగులు నిరంతరం చికిత్స తీసుకోవాలని, ఈ మేరకు క్షయ సంఘాలు చర్యలు చేపట్టాలన్నారు. క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యలకుగాను తెలంగాణ క్షయ సంఘాన్ని గవర్నర్ ప్రశంసించారు. అనంతరం విజేతలకు అవార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి తెలంగాణ క్షయ సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. -
అలసత్వాన్ని సహించం
కర్నూలు అగ్రికల్చర్: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. శనివారం తన కాన్ఫరెన్స్ హాల్లో టీబీ నియంత్రణ, సర్వేపై సమీక్ష నిర్వహించారు. గోనెగండ్ల, కోవెలకుంట్ల సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ల పనితీరు సరిగా లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. గ్రామం వారీగా టీబీ రోగులను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సర్వే చేయాలని పేర్కొన్నారు. అనుమానిత కేసులను గుర్తించి గళ్ల పరీక్షలు, అవసరమైతే ఎక్స్‌రేలు తీయించి వ్యాధిని గుర్తించాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. ఇక నుంచి టీబీ నియంత్రణపై ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో రావాలని తెలిపారు. జిల్లాలో 540 సబ్ సెంటర్లు ఉండగా, నవంబర్, డిసెంబర్ నెలలో 74 సబ్ సెంటర్లలోనే సర్వే జరిగిందని, అన్ని సబ్ సెంటర్ల పరిధిలో గ్రామాల వారీగా సర్వే చేయాలన్నారు. కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చిన టీబీ కేసులను సంబంధిత క్లస్టర్లకు రెఫర్ చేస్తుంటారని, వారికి కూడా ఎటువంటి జాప్యం లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. నవంబర్ నెలలో 700, డిసెంబర్ నెలలో 949 టీబీ కేసులను గుర్తించి చికిత్స చేపట్టినట్లు వివరించారు. సమీక్షలో అన్ని క్లస్టర్ల ఎస్పీహెచ్ఓలు, ఎస్టీసీలు పాల్గొన్నారు.