బృహత్తరంగా కాళేశ్వరం

Telangana Government planned To Move 3 TMC Water  From Kaleshwaram To Daily - Sakshi

కాళేశ్వరం నుంచి రోజుకు మొత్తం 3 టీఎంసీలు తరలించేలా ప్రణాళిక

ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు..

మరో టీఎంసీ తరలింపునకుప్రభుత్వం ప్రణాళిక

దీని అంచనా వ్యయం రూ. 25వేల కోట్లకు పైనే.. త్వరలో పచ్చజెండా.. జూన్‌ తర్వాత పనులు షురూ 

తరలింపు ఇలా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు పంపుల బిగింపు ,ఎల్లంపల్లి దిగువన అదనపు టన్నెల్‌తో మిడ్‌మానేరుకు తరలింపు..మిడ్‌మానేరు నుంచి పైప్‌లైన్, గ్రావిటీ ద్వారా మల్లన్నసాగర్‌ వరకు.

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ద్వారా వచ్చే వర్షాకాలానికే గోదావరి నీటిని ఎత్తిపోసేలా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. దీనికి సమాంతరంగా మరో బృహత్‌ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడో మూడో టీఎంసీ నీటిని కూడా తరలించే ప్రక్రియపై దృష్టి పెట్టింది. అదనపు టీఎంసీ నీటి తరలింపుకు అవసరమైన నివేదికలు సిధ్దం చేస్తోంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటి తరలింపునకు ఇప్పటికే సివిల్‌ పనులు కొనసాగుతుండగా, అదనంగా పంపులు, మోటార్లు బిగించేందుకు అవసరమైన లెక్కలు వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు, అటునుంచి మల్లన్న సాగర్‌ వరకు నీటిని తరలించే మార్గాలు, అయ్యే వ్యయం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. 

ఇప్పటివరకు 2.. ఇకపై మూడు 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఆయకట్టుకు అవసరమయ్యే నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 225 టీఎంసీలు అవసరం కాగా, ఇందులో 180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా మళ్లించారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు మళ్లించి, మిగిలిన నీటిని భూగర్భజలం ద్వారా వినియోగించుకునేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు తరలించేలా ప్రస్తుత ప్రణాళిక ఉంది. అయితే ప్రభుత్వం మిడ్‌మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన’పథకాన్ని చేపట్టింది. దీంతో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ మొదలుకుని.. గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు ఒక టీఎంసీ నీరు మాత్రమే లభ్యతగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఒక టీఎంసీని ఎస్సారెస్పీ, పునరుజ్జీవ పథకానికి, మరో టీఎంసీని కొండపోచమ్మ సాగర్‌ వరకు తరలించేలా ప్రణాళిక వేసింది. రెండు టీఎంసీ తరలింపు ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలకు మూడో టీఎంసీ అవసరమున్న నేపథ్యంలో దానికి పనులు ఆరంభించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూడో టీఎంసీ ప్రణాళిక సిద్ధమైంది. 

 
25వేల కోట్లు దాటనున్న వ్యయం 
అదనపు టీఎంసీ నీటి తరలింపుపై అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిపారుదల వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల పరిధిలో 15 మోటార్లు అదనంగా అమర్చనున్నారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా రూ.1600కోట్ల మేర వ్యయం కానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన తాళ్లకొత్తపేట నుంచి వరద కాల్వ 92 కి.మీ. పాయింట్‌ వద్ద కలిపే వరకు 32 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ చానల్, దాదాపు 17 కిలోమీటర్ల టన్నెల్, అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణానికి రూ.10,500 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు మొదట టన్నెల్‌ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రెషర్‌ మెయిన్, పైప్‌లైన్‌లు, గ్రావిటీ కాల్వల ద్వారా నీటిని తరలించేలా తుది ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి రావడం.. 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ నిర్మాణానికి రూ.14,500 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాధమిక అంచనా వేశారు. అదనపు టీఎంసీ నిర్మాణానికి మొత్తంగా రూ.25వేల కోట్లకు మించి అదనపు వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,500 కోట్లు కాగా, ఈ మొత్తం వ్యయం కలిపితే ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లను దాటనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో భూసేకరణ, ఆర్‌–ఆర్‌ అవసరాలను పక్కన పెడితే కేవలం పనులకు సంబంధించి రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటికే రూ.40వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా నిధులకై రుణాలు తీసుకోగా, అదనంగా అయ్యే వ్యయానికి సైతం రుణాలు తీసుకునే అవకాశాలున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top