ఒడిశాకు మన కరెంటోళ్ల సాంత్వన

Telangana electricity staff helping hand to Odisha - Sakshi

తుపానుతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం 

పునరుద్ధరణ చర్యల్లో తెలంగాణ విద్యుత్‌ సిబ్బంది  

భువనేశ్వర్‌ సహా పలు చోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్‌: ఫొని తుపాను సృష్టించిన విధ్వంసంతో అతలాకుతలమైన ఒడిశాలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు మన రాష్ట్ర విద్యుత్‌ సిబ్బంది పడుతున్న శ్రమ ఆ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకుంటోంది. తుపాను దెబ్బకు విద్యుత్‌ సరఫరా కుదేలై అంధకారం నెలకొన్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు సాయం చేస్తున్నారు. మన రాష్ట్ర విద్యుత్‌ సిబ్బంది సహకారంతో మంగళవారం నాటికి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు చుట్టుపక్కల 34 కిలోమీటర్ల మేర ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లకు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఫొని తుపాను కారణంగా భీకరంగా వీచిన గాలులతో ఒడిశావ్యాప్తంగా విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి. దీంతో 16 జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు సహకరించాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. సీఎం కేసీఆర్‌ స్పందించారు.

ఒడిశాలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల్లో భాగం కావాలని సీఎస్‌ ఎస్‌కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు 1,000 మంది ఉద్యోగులను ఈ నెల 7న ఒడిశాకు పంపాయి. మన విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామగ్రి, ఆహార సామగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎల్‌.గోపయ్య పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. 537 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్‌ ఫార్మర్లను మళ్లీ పనిచేసేలా చేశారు. భువనేశ్వర్‌తో పాటు, పూరీ జిల్లాలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చేశారు. తెలంగాణ ఉద్యోగులు కష్టపడి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారని కోర్దా కలెక్టర్‌ భూపేందర్‌సింగ్‌ పూనియా కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ప్రశంసలు
ఒడిశాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న విద్యుత్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఒడిశాకు వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే అక్కడ విద్యుత్‌ పునరుద్ధరణ పనులు విజయవంతం చేశారని అభినందించారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనియాడారు. కొన్ని గంటల సమయంలోనే అక్కడికి చేరుకుని, వర్షంలో కూడా పనిచేసి సామాజిక బాధ్యత నెరవేర్చారని కొనియాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top