యువ శక్తి 

Telangana Election  Youth Voters Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలు యువత చేతుల్లోనే ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా యువ ఓటర్లే ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ అభ్యర్థిని విజయం వరించినట్లే. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల లోపువారి ఓట్లే కీలకం కానున్నాయి. జిల్లా ఓటర్లు 27.12 లక్షలుకాగా.. వీరిలో 57.72 శాతం ఓటర్లు 39 ఏళ్ల లోపువారే కావడం విశేషం. ఈనెల 12న ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మేడ్చల్, వికారాబాద్‌ జిల్లాలతో పోల్చుకుంటే రంగారెడ్డి జిల్లాలోనే యువ ఓటర్లు అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల విభాగం అధికారులు తుది జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని రాజకీయ పక్షాల నాయకులకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఎలా తమవైపు తిప్పుకోవాలన్న అంశంపై అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు, తమ పార్టీల్లో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
 
తొలిసారిగా.. 
జిల్లాలో దాదాపు 39 వేల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగుపెట్టిన 38,479 మంది కొత్తగా ఓటు హక్కు పొందినట్లు ఓటరు జాబితాను బట్టి తెలుస్తోంది. అయితే ఓటరుగా నమోదు చేసుకోవడం పట్ల అమ్మాయిలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. అమ్మాయి.. అబ్బాయిల ఓట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 22,034 మంది యువకులు ఓటు హక్కు పొందగా.. అమ్మాయిలు 16,428 మంది మాత్రమే ఓటు సాధించారు. ఆన్‌లైన్‌లో ఓటరు నమోదుకు ఇంకా అవకాశం ఉందని, ఈ ఏడాది జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top