ఘుమఘుమ.. మధురిమ!

Sweets Shops Sales Sankranthi Specials In Hyderabad - Sakshi

సకినాలు, అరిసెలు, గారెలు, గరిజెలు.. మరెన్నో వెరైటీలు

నోరూరిస్తున్న సంక్రాంతి పిండి వంటలు  

‘స్వగృహ ఫుడ్స్‌’కు బారులు తీరుతున్న నగరవాసులు   

నాచారం నుంచి విదేశాలకు సైతం ఎగుమతులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. అందమైన రంగవల్లులతో లోగిళ్లు  హరిల్లులను తలపిస్తున్నాయి. రకరకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతున్నాయి. నగరంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇళ్లల్లో  పిండివంటలు చేసుకోలేని వాళ్లు స్వగృహ ఫుడ్స్‌ వద్ద బారులు తీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా ప్రజల అభిరుచులకు అనుగుణమైన పిండివంటలతో స్వగృహ ఫుడ్స్‌ స్టాళ్లు  నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లల్లో పిండివంటలు చేసుకొనేందుకు సమయం లేని వారికి ఈ స్టాళ్లు ఫుడ్‌ ప్రదాయినిగా మారాయి. నాచారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు, విదేశాలకు సైతం శ్రీదేవి స్వగృహఫుడ్స్‌ను ఎగుమతి చేస్తున్నారు.

తక్కువ ధరల్లోనే, నాణ్యమైన, రుచికరమైన పిండివంటలను అందజేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో నాచారంలోని శ్రీదేవి స్వగృహ ఫుడ్స్‌ స్టాల్‌ వద్ద జనం బారులు తీరుతున్నారు. రెండు రోజుల్లోనే 7 క్వింటాళ్ల సకినాలను విక్రయించినట్లు నిర్వాహకుడు రమేష్‌రావు చెప్పారు. మొత్తం 50 రకాల పిండివంటలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. 25 ఏళ్లుగా పిండివంటలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల పిండివంటలు కిలోకు రూ.250 నుంచి రూ.280కు ఇక్కడ లభిస్తున్నాయి. నగరంలోని అన్ని చోట్ల స్వగృహ ఫుడ్స్‌లో రకరకాల పిండివంటలను సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.  

నాణ్యతే నడిపిస్తోంది  
25 ఏళ్ల క్రితం మా అమ్మ సావిత్రమ్మ దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రుచికరమైన, నాణ్యమైన పిండివంటలు తయారు చేసి ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.శుభకార్యాలకు, పెళ్లిళ్లు, వేడుకలకు, సభలు, సమావేశాలకు ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తున్నాం.  – రమేష్‌రావు, శ్రీదేవి స్వగృహ ఫుడ్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top