నామినేషన్లలో తప్పుడు వివరాలిస్తే శిక్ష | Submitting False Information In Election Nomination Is Offense | Sakshi
Sakshi News home page

నామినేషన్లలో తప్పుడు వివరాలిస్తే శిక్ష

May 23 2018 3:00 AM | Updated on Aug 14 2018 4:44 PM

Submitting False Information In Election Nomination Is Offense - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో తప్పుడు వివరాలు పేర్కొన్న వారు శిక్షార్హులని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తప్పుడు వివరాలు నమోదు చేసిన వారిపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 177 ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపింది. నామినేషన్‌ దాఖలుతోపాటు పోటీ చేసే వారిపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను వెల్లడించాలని, నామినేషన్‌ పత్రాలపై అభ్యర్థి కాకుండా మరో ఇద్దరు సాక్షులుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పంచాయతీ ఎన్నికల నిబంధనల అమలులో రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోని అంశాలకు అనుగుణంగా నిబంధనల రూపంలో ప్రతి రోజు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.

పోలింగ్‌ ప్రక్రియలో అమలు చేసే నిబంధనలను పేర్కొంటూ తాజాగా మరికొన్ని నిబంధనలను విడుదల చేసింది. మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులుగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. ప్రభుత్వ సాయుధ సిబ్బంది రక్షణలో ఉండే ప్రజాప్రతినిధులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండటానికి వీలులేదు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రంలో కి వచ్చే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ఉండాలి. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ధారించే గుర్తింపు కార్డు వంటి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement