పరగడుపున ప్రత్యేకమా?

Students Suffering With Food Shortage in Junior Colleges - Sakshi

దాతలు సహకరిస్తేనే తీరనున్న ఆకలి సమస్య  

కళాశాలలు, పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం తరగతులు

వంద శాతం ఫలితాల సాధనకు అధికారుల యత్నం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వివిధ సబ్జెక్టుల బోధనపై దృష్టి సారించారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరగడుపున అలాగే వస్తున్నారు. దీంతో వారికి అర్ధాకలితో నీరసం తప్పడం లేదు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు ఎక్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో ఉదయం వచ్చేటప్పుడు టిఫిన్‌ తెచ్చుకుంటే సరి లేదంటే సాయంత్రం వరకు ఇబ్బందులు తప్పడం లేదు. వీరితో పాటు గతంలో దాతలు, అధికారులు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆకలితో చదివిన చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదని కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు. 

అల్పాహారం అందిస్తేనే ఫలితాలు  
గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ చొరవతో పదోతరగతి విద్యార్థులకు మల్టీగ్రెయిన్‌ బిస్కెట్లను ఉదయం, సాయంత్రం అందజేశారు. ఈ సంవత్సరం అలాంటి చర్యలేవీ తీసుకోలేకపోయారు. ఇక జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్‌ బాలుర కళాశాలలో రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహకారంతో అధ్యాపకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే జడ్చర్ల, మిడ్జిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల విద్యార్థులకు దాతలు, నాయకులు, సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

పూర్తయిన సిలబస్‌
ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు సిలబస్‌ పూర్తి చేశారు. వీరికి వచ్చే ఫిబ్రవరిలో ప్రాక్టికల్‌ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చదువులో వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ చూపుతూ, స్లిప్‌టెస్టులు యూనిట్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు దాదాపుగా సబ్జెక్టులన్నీ పూర్తయ్యాయి. అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో గణితం, సైన్స్, ఇంగ్లిష్‌పై ప్రిపరేషన్‌ సాగడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చదువు ఒత్తిడితో పాటు దూరం నుంచి రావడం, పోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు సహకరించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

దాతలు ఆదుకుంటేనే..   
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల సిలబస్‌ పూర్తయింది. ఈసారి వందశాతం ఫలితాల దిశగా కృషి చేస్తున్నాం. అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.– వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్‌ శాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top