మున్సి‘పోల్స్‌’పై సందిగ్ధం  | State Election Commission Went To High Court | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’పై సందిగ్ధం 

Jun 23 2019 2:30 AM | Updated on Jun 23 2019 5:35 AM

State Election Commission Went To High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు జూలై నెలలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. వచ్చే జూలైతో పురపాలికల గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలనేది కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉం టుందని వారంటున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక కనీసం 151 రోజుల గడువు అవసరమని, వార్డులవిభజన, ఓటరు నమోదుకు నిర్ణీత గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ వ్యవహారం సెప్టెంబర్‌ మాసాంతంకల్లా ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు.  

కోర్టుకెళ్లిన ఎన్నికల సంఘం 
ఈ ఏడాది జూలై 2న రాష్ట్రంలోని 53 పురపాలక సంఘాలు, 3 నగర పాలక సంస్థల పాలకవర్గాలకు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు దగ్గరపడుతున్నా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో భాగంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ పురపాలక శాఖ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్‌ ఆసక్తి కలిగిస్తోంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు 30 రోజులు, దాని తుది నోటిఫికేషన్‌కు మరో వారం రోజులు, వార్డులవారీగా ఓటర్ల నమోదుకు నెల రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు 60 రోజులు, వివిధ కేటగిరీలవారీగా వార్డుల విభజనకు వారం రోజులు, వార్డులు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ఖరారుకు మరో వారం .. ఇలా తమకు కనీ సం ఐదు నెలల సమయం పడుతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ పేరిట దాఖ లు చేసిన కౌంటర్‌లో పేర్కొనడం గమనార్హం. 

కొత్తగా 68 మున్సిపాలిటీలు..!
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో 173 గ్రామపంచాయతీలను విలీనం చేసింది. 131 పంచాయతీలను పొరుగున ఉన్న నగర పాలకసంస్థల్లో కలిపింది. బాదేపల్లి మున్సిపాల్టీలో విలీనమైన జడ్చర్ల పంచాయతీ పదవీకాలం వచ్చే ఏడాది డిసెంబర్‌ 4తో ముగియనుంది. నకిరేకల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 15న మున్సిపాల్టీగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఏర్పడ్డ పురపాలికల్లో వార్డులవారీగా చేయాల్సిన కసరత్తు చాలా ఉండటంతో జాప్యం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ జూలై నెలలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పగా, అధికారులు మాత్రం 151 రోజుల గడువు కావాలని కోర్టులో కౌంటర్‌ వేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement