'శోభా'యమానం

Sri Rama Navami Shobha Yatra in Hyderabad - Sakshi

వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర  

ఆకట్టుకున్న దేవతామూర్తుల విగ్రహాలు  

వీధుల్లో కాషాయ రెపరెపలు   

తరలివచ్చిన భక్తజనం

అబిడ్స్‌/జియాగూడ: శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీధుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. యాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్‌ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సమితి నాయకుడు డాక్టర్‌ భగవంతరావు ఆధ్వర్యంలో శోభాయాత్రను కనుల పండువగానిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఆధ్వర్యంలో ధూల్‌పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేక బ్యాండ్‌ మేళాలు, డీజేలు, యువత ఆటాపాటలతో శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది.

సీతారాంబాగ్, గంగాబౌలి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలు మంగళ్‌హాట్‌ ప్రధాన రోడ్డులో కలిశాయి. జాలిహనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్‌బజార్, చుడీబజార్, బేగంబజార్, ఛత్రి, సిద్ధిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్‌ మీదుగా హనుమాన్‌ వ్యాయమశాల వరకు శోభాయత్ర కొనసాగింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక నేతలు భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నేతలు బంగారు సుధీర్‌కుమార్, మహేందర్‌ వ్యాస్, యమన్‌సింగ్, టీఆర్‌ఎస్‌ నేత గోవింద్‌రాఠి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బీజేపీ గ్రేటర్‌ మహిళా అధ్యక్షురాలు బండారి రాధిక తదితరులు పాల్గొన్నారు. 

భక్తుల రద్దీ.. భారీ బందోబస్తు  
శోభాయాత్ర మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బేగంబజార్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్‌ ప్రాంతాల్లోని వీధుల్లో రద్దీ నెలకొంది. కాషాయ జెండాలు చేతబూని యువత సందడి చేశారు. శోభాయాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతమాత, చత్రపతి శివాజీ మహరాజ్, వానరసేన, శ్రీరామ్‌ మహావిగ్రహం (కన్నులు మూస్తూ తెరుస్తూ ఉండడం విశేషం), సీతారాముల పల్లకి సేవ, రాధాకృష్ణులు, రాణి అవంతిబాయి, హనుమాన్‌పై శ్రీరామ్‌ రామబాణం తదితర విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రణవీర్‌రెడ్డి, చాంద్‌పాషా, శంకర్‌ బందోబస్తును పర్యవేక్షించారు. 

జై అనాల్సిందే..  
ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతమాతకు జై అనాలని, లేని పక్షంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా అన్నారు. శోభాయాత్రలో భాగంగా బేగంబజార్‌లో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భారత్‌మాతాకీ జై’ అంటూ యువత నినదించాలన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. హిందూ మనోభావాలను పెంపొందించేందుకు తన జీవితాంతం కృషి చేస్తానన్నారు. 

ఐక్యంగా మెలగాలి..  
హిందువులు ఐక్యంగా ఉంటూ హిందూ ధర్మాన్ని దశదిశలా చాటాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జితేంద్రా ఆనంద్‌ సరస్వతి పిలుపునిచ్చారు. బేగంబజార్‌లో ఆయన మాట్లాడుతూ... హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల పట్ల చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top