క్యాబ్‌ల్లో ఎస్‌వోఎస్‌ బటన్‌ తప్పనిసరి

SOS Button Must Maintain In Cabs Said By Hyderabad Police Wing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగర పోలీసులు గురువారం 15 క్యాబ్‌ నిర్వాహక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో కొత్వాల్‌ అంజనీకుమార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రతి క్యాబ్‌కు ట్రాకింగ్‌ డివైజ్‌లు, అత్యవసర సమ యంలో సాయం కోసం ఉపయోగపడే ఎస్‌వోఎస్‌ బటన్లు కచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.

తమ క్యాబ్‌లకు ట్రాకింగ్‌ డివైజ్‌లు ఉన్నాయని, ఇక ఎస్‌వోఎస్‌ను తమ యాప్‌ల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ క్యాబ్‌ల నిర్వాహకులు చెప్పగా.. మోటారు వాహనాల చట్టంలోని 125 (హెచ్‌) సెక్షన్‌ ప్రకారం వాహనంలోనే ఎస్‌వోఎస్‌ బటన్‌ ఉండాలని, దీన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. క్యాబ్‌ డ్రైవర్ల పూర్వాపరాలను అనునిత్యం పరిశీలించాలని, వారి గత చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియమించాలని కొత్వాల్‌ తెలిపారు. క్యాబ్‌ల్లో ప్రయాణించే వారి నుంచి ప్రతి సందర్భంలోనూ డ్రైవర్ల ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండాలన్నారు. మహిళల భద్రత అంశానికి సంబంధించి ఫిర్యాదు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. ప్రతి క్యాబ్‌ యాప్‌ను హాక్‌–ఐతో అనుసంధానించాలని సూచించారు. సమావేశంలో ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top