ముమ్మరంగా సింగరేణి సేవా కార్యక్రమాలు 

Singareni service programs As intensely - Sakshi

ఆపరేషన్స్, ప్లానింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆపరేషన్స్, ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే పథకాలను చేపట్టాలని సూచించారు.

పాత తరహాకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో కార్పొరేట్‌ రెస్పాన్సిబులిటీ ఫండ్‌ (సీఎస్‌ఆర్‌) కింద కార్యక్రమాల అమలుకు సూచనలు, ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఏటా దాదాపు రూ.40 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులను ఖర్చు చేస్తున్నామని, కొత్త గనులు ప్రారంభిస్తే నిధులు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితికి సంబంధించిన ‘వెబ్‌ అప్లికేషన్‌’ను ప్రారంభించారు. సింగ రేణి సేవా సమితికి సంబంధించిన అన్ని ప్రాంతాల సమాచారం, వివిధ శిక్షణలు, శిక్షణ పొం దుతున్న వారి వివరాలు వంటి అంశాలు దీని ద్వారా ఆన్‌లైన్‌లోనే పొందుపర్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు.  

450 మందికి శిక్షణ.. 
సింగరేణి వ్యాప్తంగా ప్రాథమిక పరీక్షల ద్వారా ఎంపికైన 450 మంది నిరుద్యోగ యువతకు రెసిడెన్షియల్‌ తరహాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కి శిక్షణ ఇవ్వను న్నామని పీఆర్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ ఆంటోని రాజా, పీఆర్‌ఓ బి.మహేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా సంస్థల్లో సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశ శిక్షణలు అందించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ గణాశంకర్‌ పూజారి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top