సహకారమా? విలీనమా? | Sakshi
Sakshi News home page

సహకారమా? విలీనమా?

Published Thu, May 19 2016 3:07 AM

సహకారమా? విలీనమా?

పట్టు పరిశ్రమ సిబ్బందికి ఉద్యాన బాధ్యతలు
నష్టం కలుగుతుందంటున్న పట్టుపరిశ్రమ శాఖ
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం
నేడు ఇరుశాఖలతో రాజధానిలో ఉన్నతాధికారుల సమీక్ష
 

 
మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లాలో పట్టు పరిశ్రమ రోజురోజుకూ ప్రాభవం కోల్పోతోంది. ప్రభుత్వ సహకారం లభించకపోవడంతో నిర్వీర్యమవుతోంది. మొదట్లో 74మంది ఉన్న సిబ్బంది నేడు 24మందికి చేరారు. ఉద్యోగ విరమణ పొందిన స్థానాల్లో ఖాళీలను భర్తీచేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పట్టు పరిశ్రమశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యాన శాఖ బాధ్యతల్లో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివ రకే నిర్ణయించింది. తద్వారా రైతుల వద్దకు ప్రభుత్వ లక్ష్యాలను చేర్చవచ్చని భావిస్తోంది. ఇక విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి. దీనిపై ఆయా శాఖల రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. కాగా, గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే సమావేశంలో సమన్వయంతో పనిచేసే విధానంపై  రెండు శాఖల సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు వారి  సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిసింది.


 పట్టు పరిశ్రమకు గడ్డుకాలం జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన, మత్స్యశాఖల తరువాత పట్టుపరిశ్రమ తమ ఉనికిని చాటుతోంది. ప్రస్తుతం  280ఎకరాల్లో పట్టు తోటలు పెంచుతూ రైతులు లబ్ధిపొందుతున్నారు. కాగా, పట్టుపెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు, తోటల విస్తీర్ణంపై ప్రభుత్వం మొగ్గు చూపకపోవడంతో పరిశ్రమ రోజురోజుకూ నిర్వీర్యమవుతూ వస్తోంది. గతంలో 74మంది ఉన్న ఇబ్బంది చివరికి 23మంది మిగిలారు. ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు పట్టు తోటల విస్తీర్ణానికి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడంతో పట్టు రైతుల నుంచి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

త క్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందికి ఇతరశాఖల బాధ్యతలు అప్పగించడంపై ఈ శాఖ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని పట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమకు ఇన్‌చార్జ్ డీ డీగా గోపాల్ వ్యవహరిస్తున్నారు. ఆ శాఖకు ఆయనతో పాటు పరిశ్రమ అభివృద్ధి అధికారులు, సహాయ అభివృద్ధి అధికారులు, టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు మొత్తం కలిపి 23మంది సిబ్బంది ఉన్నారు. అయితే పట్టు పరిశ్రమ డీడీకి కాకుండా మిగితా సిబ్బందికి ఉద్యానశాఖ బాధ్యతలు అప్పగించనున్నారు.


 ‘పట్టు’కు సహకారం ఫలించేనా?
జిల్లా ఉద్యానశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యాన అధికారి, విస్తరణ అధికారి పోస్టుల్లో పట్టు పరిశ్రమ నుంచి వచ్చిన సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇలా ఈ రెండుశాఖల సిబ్బంది తమ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రెండు శాఖల పనులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఆయా శాఖలపై పరస్పరం పట్టులేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పట్టు పరిశ్రమ సిబ్బందికి ఉద్యానశాఖ బాధ్యతలు అప్పగించడంతో ఉనికికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పట్టు పరిశ్రమ కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement