పురుషులు ఈ విషయాన్ని గుర్తించాలి: ఇవాంక

second day GES pleanary starts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్‌ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ బ్లెయిర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చార్‌, డెల్‌ సీఈవో క్వింటోస్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న  ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబసభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు. సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని, ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ లభిస్తుందని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. అమెరికన్‌ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. 

మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిస్కో, మైక్రోసాఫ్ట్‌తో కలిసి మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. భారత దేశంలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగిందని చందా కొచ్చర్‌ అన్నారు. భారతదేశం నుంచి మంచి క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్‌ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు. తన పిల్లలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహిళల సాధికారిత కోసం తమ ఫౌండేషన్‌ ప్రధానంగా కృషి చేస్తున్నదని చెర్రీ బ్లెయిర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top