ఎస్సీ నిరుద్యోగ యువతకు...  ఇక సులువుగా కొలువు! 

SCs are no longer easy for unemployed youths - Sakshi

ప్రత్యేక జాబ్‌ యాప్‌కు శ్రీకారం చుట్టిన ఎస్సీ కార్పొరేషన్‌  ∙ ఇంటర్, డిగ్రీ మధ్యలో ఆపేసిన వారిని దృష్టిలో పెట్టుకొని తయారీ అందులో వివరాలు నమోదు చేసుకుంటే శిక్షణ, ఉపాధి బాధ్యత కార్పొరేషన్‌దే ∙ త్వరలో అందుబాటులోకి తేనున్న ఎస్సీ అభివృద్ధి శాఖ  

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ)కు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రాడ్యుయేషన్, అంతకు మించిన కోర్సులు చదివిన ఎస్సీ యువతకు సులువుగా ఉద్యోగాలు దొరుకుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సులను మధ్యలో మానేసిన యువతీ యువకులు ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాబ్‌ యాప్‌ను తీసుకురానుంది. అర్ధంతరంగా చదువు ఆపేసిన యువతకు ఈ యాప్‌ ద్వారా తప్పనిసరి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ యాప్‌ రూపకల్పనపై అధికారులు సాంకేతిక నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపారు. అతి త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

నైపుణ్యాభివృద్ధి తర్వాతే ఉద్యోగం..
ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల్లో విద్యార్హతతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్సీ కార్పొరేషన్‌...నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి కల్పించడంపై దృష్టి సారించింది. కార్పొరేషన్‌ అందుబాటులోకి తెచ్చే యాప్‌లో ముందుగా అభ్యర్థి వివరాలు నమోదు చేసుకోవాలి. విద్యార్హతతోపాటు ఆసక్తి, అనుభవాన్ని సైతం తెలియజేయాలి. అలా ఆసక్తి, అర్హతల ఆధారంగా అభ్యర్థుల వివరాలను కార్పొరేషన్‌ విశ్లేషిస్తుం ది. ఆ తర్వాత వారిని కేటగిరీలవారీగా విభ జించి తగిన రంగంలో శిక్షణ ఇస్తుంది. నిర్ణీత గడువులో శిక్షణ పూర్తిచేసుకొని మెరుగైన ప్రతి భ కనబర్చిన వారికి సంబంధిత కంపెనీల్లో ఉద్యోగాలు సైతం కల్పిస్తుంది. అవసరమైతే మరికొంత కాలం శిక్షణ తరగతులు కూడా నిర్వహించి బ్యాచ్‌లోని వారందరికీ పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయనుంది. ఉద్యోగ కల్పనకు ఎస్సీ కార్పొరేషన్‌ యంత్రాంగం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అపోలో హాస్పిటల్స్, కెల్ట్రాన్, సెంట్రో, నాక్‌ తదితర ప్రఖ్యాత సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పించింది. ఎస్సీ యువతకు ఉపాధిని విస్తృతం చేసే క్రమంలో ఈ యాప్‌ను తయారు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లచ్చిరామ్‌ భూక్యా ‘సాక్షి’కి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top