త్వరగా సొంతూళ్లకు చేర్చండి

Rights Representatives Letter TO CM KCR On Migrant Labour - Sakshi

వలస కార్మికుల ఇక్కట్లపై సీఎం కేసీఆర్‌కు హక్కుల ప్రతినిధుల లేఖ

ఈలోగా వారికి ఆహార, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలి

కార్మికుల నివాస ప్రాంతాలకే వెళ్లి పేర్ల నమోదు చేపట్టాలి

పోలీసు, రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి

సాక్షి, హైదరాబాద్‌ : ‘మండు వేసవిలో పిల్లలు, కుటుంబాలతో లక్షల మంది వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తుండటం అత్యంత బాధాకరం. వీలైనంత త్వరగా వారిని సొంతూళ్లకు పంపించాలి. అప్పటిదాకా ఆహార, వసతి, వైద్య సదుపాయాలను కల్పిస్తామన్న హామీ ఇవ్వాలి. వారి హక్కులను, గౌరవాన్ని నిలబెట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వంద మందికిపైగా పౌర సంఘాల ప్రతినిధులు, ప్రముఖ యాక్టివిస్టులతో కూడిన కోవిడ్‌–19 అడ్వొకసీ లాక్‌డౌన్‌ కలెక్టివ్‌ విజ్ఞప్తి చేసింది. క్షేత్రస్థాయిలో వలస కార్మికుల ఆకలిదప్పికలను తీర్చుతూ వారికి చేదోడువాదోడుగా ఉంటున్న ఈ సంస్థ గత వారం రోజులుగా తమ దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.

  • తెలంగాణ నుంచి ఇప్పటివరకు 45 రైళ్ల ద్వారా 50,822 మంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపించారని వార్తలొచ్చాయి. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న కార్మికుల సంఖ్యతో పోలిస్తే వారిని తరలించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రామిక్‌ రైళ్ల సంఖ్య చాలా తక్కువ. అది కూడా రాత్రిపూట, ఊరి అవతల స్టేషన్ల నుంచి రైళ్లను నడుపుతుండటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
  • పోలీసు స్టేషన్లలో వలస కార్మికుల నమోదు నెమ్మదిగా జరుగుతోంది. ఒక్కో స్టేషన్‌లో రోజుకు 200 మందికి మించి నమోదు చేసుకోవడం లేదు. ఠాణాల ముందు రోజుల తరబడి బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. కార్మికుల నివాస ప్రాంతాలకు వెళ్లి మూకుమ్మడి నమోదు కార్యక్రమం చేపడితే ఉపయోగంగా ఉంటుంది. 
  • మూవ్‌మెంట్‌ పాస్‌ ఫర్‌ రైల్వే స్టేషన్‌ పాసుల్లో కార్మికుల వివరాలతోపాటు సంతకం చేసే అధికారి పేరు కూడా ఉండాలి. చాలా పాసుల్లో అధికారి సంతకం, తేదీ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
  • ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ కార్మికులను ఆర్టీసీ బస్సుల ద్వారా స్వరాష్ట్రాలకు పంపడానికి ఆయా ప్రభుత్వాలతో చర్చించి చర్యలు చేపట్టాలి.    
  • వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరే దాకా ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలి. 
  • ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రోజుకు రెండుసార్లు ఆహారం అందజేసే ఏర్పాట్లు చేయాలి. 
  •  స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేక రాష్ట్రంలో చిక్కుకుపోయిన ప్రతి వలస కార్మిక కుటుంబానికీ 12 కేజీల బియ్యం, రూ.1,500 నగదు ఇచ్చే జీవోను మరో మూడు నెలలు అమలు చేయాలి. 
  • కార్మికులను కొట్టడం, వేధించడం, తరిమేయడం చేయవద్దని రైల్వే స్టేషన్లు, ఇతర చోట్లలో పని చేస్తున్న పోలీసులకు ఆదేశాలివ్వాలి.   
  •  వలస కార్మికులకు సమాచారంతోపాటు సహాయం అందించడానికి ప్రతి రైల్వేస్టేషన్, ప్రతి పోలీసు స్టేషన్, తాలూకా ఆఫీసులు, కీలక రహదారుల కూడళ్ల వద్ద హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయాలి. 
  • ప్రయాణ, వైద్య అనుమతి పత్రాల పేరుతో వలస కార్మికుల నుంచి డబ్బు గుంజుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
  •  ఈ–పాసులు, ఎస్‌ఎంఎస్‌–1, ఎస్‌ఎంఎస్‌–2లలో విషయమంతా ఆంగ్లంలో ఉండటంతో కార్మికులకు అర్థం కావట్లేదు. 
  • పాసు ఇవ్వడానికీ, ఎస్సెమ్మెస్‌–2 (అదే అసలు అనుమతి పత్రం) రావడానికీ మధ్య చాలా వ్యవధి ఉండడం కూడా పెద్ద సమస్యే అవుతోంది. 
  • దుండిగల్, మాదాపూర్, ముషీరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు లింగంపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, మేడ్చల్, సికింద్రాబాద్‌ స్టేషన్ల వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. పోలీసులు తరిమేస్తుంటే నిరాశతో వెనుదిరుగుతున్నారు. చాలా చోట్ల రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు కార్మికులకు వాహన వసతి కల్పించట్లేదు.

కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ బాలుడు కర్ణాటక నుంచి కుటుంబంతో కలసి ఉత్తరప్రదేశ్‌ వెళ్తూ హైదరాబాద్‌ శివార్లలో శనివారం ఇలా సేదతీరుతూ కనిపించాడు. ఎర్రటి ఎండలో నడిచి నడిచి కాళ్లకు పుండ్లు పడటంతో అతని తల్లిదండ్రులు కేవలం ఓ బట్టను ఇలా కాలికి చుట్టారు.

వలస కార్మికుల కోసం మేడ్చల్‌ హైవేపై స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సహాయ శిబిరం దగ్గర్లో ఓ తల్లి వారం రోజుల పసిగుడ్డుతో దుమ్ములో నిస్సహాయంగా కూర్చొని ఉండగా అక్కడి వారు గమనించారు. బిడ్డ ఒంటిపై బట్టలు కూడా లేవు. భూమిక వుమెన్స్‌ కలెక్టివ్‌ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి తన కారులో ఉన్న టవల్‌ను ఆ శిశువుపై కప్పేందుకు ఇవ్వడంతోపాటు 700 కి.మీ. దూరంలో ఉన్న గడ్చిరోలి జిల్లాలోని ఆమె సొంతూరుకు వెళ్లేందుకు రూ. 20 వేలతో కారును ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు పోలీసుల నుంచి అనుమతి ఇప్పించారు. శనివారం ఈ మహిళ తన పాపతో ఇంటికి క్షేమంగా చేరుకుంది.

వారం రోజుల పసిపాపతో ఉన్న ఈమె పేరు చమేలీ. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో భర్త, పసిపాపతో కలసి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన పయనమైంది. వారి కష్టాన్ని చూసి చలించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సొంతూరుకు పంపేందుకు వీలుగా నగర శివార్ల వరకు తన వాహనంలో దింపారు. అక్కడి నుంచి ఓ ట్రక్కులో ఆ కుటుంబం శనివారం రాత్రి స్వరాష్ట్రం బయలుదేరింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top