ప్రైవేటు ‘ఇంజనీరింగ్‌’ దందా!

Replace management seat without notification - Sakshi

నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ  

రూ.లక్షల్లో డొనేషన్లు దండుకుంటున్న కళాశాలలు 

ఎంసెట్‌ ఫలితాలు రాక ముందే బేరసారాలు 

అంగట్లో బీ–కేటగిరీ సీట్ల అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు అక్రమ అడ్మిషన్ల దందాకు తెరతీశాయి. బీ–కేటగిరీ మేనేజ్‌మెంట్‌ కోటా ఇంజనీరింగ్‌ సీట్లకు రెక్కలొచ్చాయి. ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించక ముందే ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు కోర్సుల వారీగా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి ప్రైవేటు కళాశాలలు బహిరంగ ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంసెట్‌ మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ‘మేనేజ్‌మెంట్‌ కోటా’ఫీజులను మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు తెరచాటుగా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను అమ్ముకుంటున్నాయి. ఎంసెట్‌ ఫలితాల ప్రకటించక ముందే, బహిరంగ ప్రకటన జారీ చేయకుండానే అక్రమంగా బీ–కేటగిరీ సీట్లను భర్తీ చేసేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, ఈసీఈ వంటి కోర్సుల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు భర్తీ అయిపోయాయి. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్య ప్రతినిధి సీట్ల అమ్మకాలపై బేరాసారాలు జరుపుతున్న ఓ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అడ్మిషన్‌ కోసం రూ.14 లక్షల డొనేషన్‌తోపాటు ఏటా రూ.90 లక్షల ఫీజును చెల్లించాలని అడుగుతూ ఆ వీడియోలో సదరు కళాశాల ప్రతినిధి అడ్డంగా దొరికిపోయాడు.

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీట్ల భర్తీ ఇప్పటికే ముగిసిందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక ఐటీ విభాగం సీటుకు రూ.8 లక్షలు, ఈసీఈ విభాగంలో సీటుకు రూ.7 లక్షల డొనేషన్‌ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. నిర్ణీత డొనేషన్లు చెల్లిస్తేనే సీటు దక్కుతుందని, ఎలాంటి తగ్గింపులుండవని స్పష్టం చేశాడు. ఇష్టముంటేనే డొనేషన్లు చెల్లించి సీట్లను రిజర్వు చేసుకోవాలని, లేకుంటే మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ కోసం తాము పత్రికల్లో బహిరంగ ప్రకటన జారీ చేసినప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం గమనార్హం. అయితే కన్వీనర్‌ సీట్ల ఫీజుల మాదిరిగానే బీ–కేటగిరీ సీట్ల ఫీజులూ ఉంటాయి. కానీ దీనికి విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు ఫీజులను దండుకుంటున్నాయి. ముందే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను అమ్మేసుకుని ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వాటిని భర్తీ చేశామని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఉత్తుత్తిగా పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయని చాలా ఏళ్ల నుంచి ఉన్న ఆరోపణలకు ఈ ఉదంతం మరింత బలాన్నిచ్చింది. బీ–కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాల నిర్మూలనకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top