పేదల భూములతో ‘రియల్‌’ వ్యాపారం

Real estate business with poor peoples and - Sakshi

రైతుల నుంచి రూ. 8 లక్షలకు కొని రూ. కోటికి అమ్ముతున్నారు

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు కుటుంబం చేసుకున్నాడు

సీఎం కేసీఆర్‌పై సబితారెడ్డి ధ్వజం

కందుకూరు: పేదల భూములను గుంజుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రియల్‌ వ్యాపారం చేస్తుందని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఆకుమైలారంలో మాజీ సర్పంచ్‌ నందీశ్వర్, మాజీ ఉప సర్పంచ్‌ రాజు, కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించి, గ్రామంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు భూములను పంచితే.. నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల నుంచి కారు చౌకగా ఎకరా రూ. 8 లక్షలకు గుంజుకుని రూ.కోటికి అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఫార్మాతో ఈ ప్రాంతం కాలుష్యమయమై జీవనం దెబ్బతింటుందన్నారు. భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.  సోనియా గాంధీ పుణ్యాన తెలంగాణ సాధించుకుంటే, బంగారు తెలంగాణ చేస్తామంటూ మాటల గారడీతో సీఎం కేసీఆర్‌ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. సమగ్ర సర్వే చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండానే పన్నుల పేరుతో జలగల్లా రక్తం తాగుతున్నారన్నారు. కులాల వారీగా ప్రజలను విడగొట్టి పబ్బం గడుపుకోవడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు.  

ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదు... 
జిల్లాలోని ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచి టీఆర్‌ఎస్‌ పంచన చేరినా ఈ ప్రాంతంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ విమర్శించారు. ఫార్మాసిటీతో ఈ ప్రాంతానికి నష్టం ఉన్నా సొంత లాభం కోసం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు నోరు మెదపడంలేదన్నారు. సీఎం నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడతారన్నారు. జెడ్పీలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి మాట్లాడుతూ... రుణ మాఫీ పూర్తిగా చేపట్టలేదని, అర్హులకు పింఛన్లు అందడంలేదన్నారు.

ఫార్మా భూములకు తక్కువ పరిహారం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఏ–బ్లాక్‌ అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ప్రసూన రేవంత్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ ఎంపీపీ మహేష్‌గౌడ్, మహేశ్వరం మండల అధ్యక్షుడు శివమూర్తి, అంబయ్యయాదవ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి దర్శన్‌రెడ్డి, రఘుమారెడ్డి, రైతు సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, కాకి రాములు, జి.సామయ్య, రూప్లానాయక్, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్తయ్య, మాజీ ఎంపీటీసీ రజిత, సీనియర్‌ నాయకులు రాంరెడ్డి, ఎస్‌.జగన్, శ్రీకాంత్‌రెడ్డి, పరంజ్యోతి, దేవేందర్, సురేష్, శ్రీశైలం, రేవంత్‌రెడ్డి, సాయిలు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top