10 లక్షల ఎకరాల్లో తెలంగాణ ‘సోన’ 

This Rainy Season 10 Million Acres Of Telangana Sona Rice Cultivation - Sakshi

మరో 10 లక్షల ఎకరాల్లో సాంబమసూరి 

వ్యవసాయ శాఖ సూత్రప్రాయ నిర్ణయం 

సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా ప్రతిపాదన 

ఇప్పటికే జిల్లాలకు చేరిన పలు విత్తనాల విక్రయాలకు బ్రేక్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వర్షాకాలం సీజన్‌కు రాష్ట్రంలో తెలంగాణ సోనా రకం వరిని 10 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాంబమసూరి రకాన్ని కూడా 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా మేలు రకం వరి విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏయే రకాన్ని ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే దానిపై ప్రణాళికలు తయారు చేశారు. (పద్ధతిగా.. పది)

పలు దఫాలుగా శాస్త్రవేత్తలతో చర్చించి వరి సాగు విస్తీర్ణంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు రకాలతో పాటు 35 వేల ఎకరాల్లో జేజీఎల్‌–1798, 25 వేల ఎకరాల్లో డబ్ల్యూజీఎల్‌–384, హెచ్‌ఎంటీ సోనా 25 వేల ఎకరాల్లో, అలాగే జై శ్రీరాం, ఇతరాలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర సాధారణ వరిలో ఎంటీయూ–1010 రకాన్ని 9 లక్షల ఎకరాలు, 3.5 లక్షల ఎకరాల్లో కేఎన్‌ఎం–118 రకం, 50 వేల ఎకరాల్లో ఎన్‌టీయూ–1001, 30 వేల ఎకరాల్లో ఎంటీయూ–1061, ఇతరాలు 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. 

మేలు రకం, సాధారణ రకం వరి కలిపి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. మూడు జిల్లాల్లో అత్యధికంగా వరి సాగును వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందులో నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. మొత్తం ప్రతిపాదిత విస్తీర్ణంలో 24.5 శాతం ఈ మూడు జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వరి విత్తనాల లభ్యత కూడా అధికంగానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆ విత్తనాల సరఫరా నిలిపివేత.. 
సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే జిల్లాల్లో వరి, మొక్కజొన్న విత్తనాల విక్రయాలను తాత్కాలికంగా నిలిపేయాలని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు ప్రస్తుతం విత్తనాలు అమ్మట్లేదు. రెండు, మూడు రోజుల్లో వరి విత్తనాల విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అది కూడా ప్రభుత్వం ఏయే జిల్లాలో ఎంత విస్తీర్ణం చెప్పిందో ఆ మేరకు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక మొక్కజొన్న అసలు వానాకాలంలో సాగు చేయొద్దని ఆ విత్తనాలు అందుబాటులో ఉంచొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే విత్తన కంపెనీలు, డీలర్లు మాత్రం సాగు సమీపించే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top