ఏపీకి తరలిపోయిన ‘రైల్‌ నీర్‌’

Rail Neer Project has moved to Andhra Pradesh - Sakshi

హైదరాబాద్‌లో ఏర్పాటుకు 2012లోనే సన్నాహాలు

సరైన ప్రోత్సాహం లేక జాప్యం

రోజుకు లక్ష లీటర్ల మంచినీటి శుద్ధి

10 వేల మందికి ఉపాధి

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన రైల్‌ నీర్‌ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధినివ్వగలిగే ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేం దుకు 2012లోనే సన్నాహాలు మొదల య్యాయి. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వ ర్యంలో రూ. 50 కోట్లకు పైగా అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటివరకూ భూమిని, వనరులను కేటా యించలేదు. దాంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఏపీకి తరలి వెళ్లింది. నూజివీడు దగ్గర దీన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ఐఆర్‌సీ టీసీకి ఎకరం భూమిని కేటాయించింది. దీంతో నగరంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్నట్టే అయింది. 

స్వచ్ఛమైన మంచినీరే లక్ష్యం..
నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు, 26 ఎంఎంటీఎస్‌ స్టేషన్ల నుంచి రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. నిత్యం వందలాది రైళ్లు నడుస్తాయి. దక్షిణమధ్య రైల్వేలోనే సికింద్రాబాద్‌ అతిపెద్ద రైల్వేస్టేషన్‌. ఇలాంటి పెద్ద స్టేషన్‌లో కూడా ప్రయాణికులకు తాగునీటిని అందజేసేందుకు రైల్వేకు ఎలాంటి సొంత ఏర్పాట్లూ లేవు. దీంతో ప్రయాణికులు అధిక ధర వెచ్చించి ప్రైవేటు మినరల్‌ వాటర్‌నే కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ధరలో మినరల్‌ వాటర్‌ను అందజేసే ఉద్దేశంతో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఐఆర్‌సీటీసీ ముందుకొచ్చింది. రోజుకు లక్ష లీటర్ల మంచినీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామని 2012లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 

ఫ్యాబ్‌ సిటీ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదన
ఫ్యాబ్‌ సిటీ వద్ద 4 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు మంచినీటి పైపులైన్‌ కూడా ఏర్పాటు చేయాలని ఐఆర్‌సీటీసీ కోరింది. దీనికి అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఫ్యాబ్‌ సిటీ వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రోజుకు అక్కడి నుంచి రైల్వే స్టేషన్లకు, రైళ్లకు వాటర్‌ బాటిళ్లను సరఫరా చేసేందుకు రవాణా వ్యవస్థ, సిబ్బంది అవసరమయ్యేవారు. వాటర్‌ బాటిళ్ల విక్రయంపైనా పలువురు ఉపాధి పొందే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టును పలుమార్లు రైల్వే బడ్జెట్‌లో కూడా ప్రతిపాదించారు. కానీ దక్షిణమధ్య రైల్వే ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల లేమి తదితర కారణాల రీత్యా ఆ ప్రాజెక్టు ఏపీకి వెళ్లిపోయింది.

ఇప్పటికైనా స్థలమిస్తే..
ఇటీవల రైల్‌ నిలయంలో జరిగిన సమావేశంలోనూ పలువురు ఎంపీలు రైల్‌ నీర్‌ ప్రాజెక్టును నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ను కోరారు. ఈ అంశంపై రైల్వేబోర్డు సమావేశంలో చర్చించనున్నట్లు జీఎం స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూమిని, ఇతర వసరులను సమకూరిస్తే హైదరాబాద్‌లో మరో ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top