తారక రాముడి మానస పుత్రిక.. | Sakshi
Sakshi News home page

తెలుగు వర్సిటీకి.. నిర్లక్ష్యపు తెగులు

Published Sat, Feb 22 2020 10:33 AM

Professors Shortage in Telugu University Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాషకు వెలుగునివ్వాల్సిన మన ‘తెలుగు విశ్వవిద్యాలయం’ మాతృభాషా పరిరక్షణ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నది. ఒకప్పుడు తెలుగు కళాకారులకు ఓ కాణాచీగా కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు భూతలస్వర్గంగా గుర్తింపు పొందిన  విశ్వవిద్యాలయం ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూగబోయింది. భాషావికాసం కోసం పాటుపడటం సంగతేమో గానీ, తెలుగుపై ఆసక్తితో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కనీస పాఠాలు బోధించలేని దుస్థితి నెలకొంది. నేడు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వ విద్యాలయంపై ప్రత్యేకకథనం !

తారక రాముడి మానస పుత్రిక..
తెలుగు భాష, సాహిత్యాలు, సంస్క­తి కళలు, జానపద విజ్ఞానం, చరిత్ర తదితర రంగాల్లో సమగ్ర వికాసాన్ని సాధించడం కోసం నాటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ 1985 డిసెంబర్‌ 2న ఈ వర్సిటీని ప్రారంభించారు. తొలినాళ్లలో ఆయనే దీనికి ఛాన్స్‌లర్‌ వ్యవహరించారు. గవర్నర్‌ను ఛాన్సలర్‌గా నియమిస్తేనే గుర్తిస్తామని యూజీసీ పేచీ పెట్టడంతో ఆయన వీసీ పదవి నుంచి వైదొలగారు. నాటి నుంచి రాష్ట్ర గవర్నరే దీనికి వీసీగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలో ఎంఏ తెలుగు, జర్నలిజం, చిత్రం, సంగీతం, రంగస్థల కళలు వంటి కోర్సులను అందిస్తుంది. తెలుగు భాషా వికాసం, పరిరక్షణ కోసం ఏర్పాటైన తెలుగు యూనివర్సిటీలో తెలుగు విభాగాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంఏ తెలుగు విభాగంలో ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ కోర్సులను అందిస్తుంది. మొత్తం 60 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి పాఠాంశ్యాలు బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌ సహా ఇద్దరు రీడర్లు, ముగ్గురు లెక్చరర్స్‌ అవసరం కానీ ప్రస్తుతం వర్సిటీ తెలుగు శాఖలో ఒక రెగ్యులర్‌ ఉపాధ్యాయురాలు సహా మరో ముగ్గురు పదవీ విరమణ చేసిన (విజిటింగ్‌ ఫ్యాకల్టీ) ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్క తెలుగు విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాలది ఇదే పరిస్థితి. ఏటా పదవీ విరమణలు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటం, ఆ మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయకపోవడం, పాలకమండలి ఏర్పాటు చేయకపోవడం, దాదాపు రెండేళ్ల నుంచి వీసీ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల వర్సిటీలో అభివృద్ధి కుంటుబడిపోతుంది. వర్సిటీలో అంతర్జాతీయ తెలుగు భాషాభివృద్ధి కేంద్రం ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయింది. 

విదేశాల్లో తెలుగు వెలుగుకు తప్పని కష్టాలు..
తెలుగు రాయడం, మాట్లాడటం రాని దేశాల్లో ఆ భాషను నేర్పించేందుకు వర్సిటీ వేదికగా అంతర్జాతీయ తెలుగు భాషా వికాసం కేంద్రం ఏర్పాటైంది. భాషా విస్తరణలో భాగంగా దేశంలోని తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, చత్తీస్‌గడ్, అస్సాం, న్యూఢిల్లీ, గుజరాత్, అండమాన్‌ నికోబార్‌ దీవులు సహా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. ఆయా విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుని అక్కడి వారికి శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఇజ్రాయిల్‌లోని హిబ్రు విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా తెలుగును నేర్చుకోవాలనే విదేశీ ఔత్సాహికులను గుర్తించి సంవత్సరానికి ఐదుగురు చొప్పున నగరానికి రప్పించి తెలుగును నేర్పిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నట్టు అంచనా. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, విదేశాల్లో మరో 4 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. భాషా పరిరక్షణ కోసమే కాకుండా అంతర్జాతీయంగా తెలుగు భాషా వ్యాప్తికి తన వంతు కృషి చేసింది. అంతేకాదు తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటూ చేపట్టిన ఉద్యమానికి తెలుగు విశ్వవిద్యాలయం వేదికైంది. భాషా వికాసం కోసమే కాకుండా తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంలో వర్శిటీ కీలక పాత్రపోషించింది. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతుంది.

వెనుకబడి పోతున్నాం
ఇంగ్టిషు భాష మోజులో పడిపోయి మాతృభాషను విస్మరిస్తున్నాం. మాతృభాషను మరిచిపోవడం అంటే కన్నతల్లిని కాదనుకోవడం వంటిదే. మాట్లాడటం, రాయడంలో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరింది. మాతృభాషను ప్రాథమిక మాధ్యమం వరకు విధిగా అమలు చేస్తేనే భాష బతుకుతుంది. లేదంటే పూర్తిగా కనుమరుగవడం ఖాయం. – ఆచార్య గౌరీశంకర్, తెలుగుశాఖ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement