
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది.
కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది.