పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక! | Prashanth Reddy About Double Bed Room Flats | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక!

Sep 17 2019 2:18 AM | Updated on Sep 17 2019 3:37 AM

Prashanth Reddy About Double Bed Room Flats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2.82 లక్షల ఇళ్ల నిర్మాణాలకు మంజూరు ఇచ్చిందని, ఇందులో 1.99 లక్షల ఇళ్లకు టెండర్లు పిలవగా.. 1.79 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే 34 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మరో 96 వేల ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు రూ.18,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.6,972 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది రూ.4145 కోట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బడ్జెట్‌లో రూ.180 కోట్లు కేటాయించామని, రూ.1,365 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, రూ.2,500 కోట్లు హడ్కో ద్వారా రుణం తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. 

ఎంపిక ప్రక్రియ ఇలా.. 
డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మూడు అంచెల్లో అర్హత నిర్ధారణ ఉంటుందని చెప్పారు. తొలుత గ్రామ సభ నిర్వహించి అక్కడ ఆశావహుల పేర్లను ప్రతిపాదిస్తామన్నారు. అలా ప్రతిపాదించిన ప్రాథమిక జాబితాను జిల్లా స్థాయిలో మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ఈ జాబితాను పరిశీలిస్తామన్నారు. అక్కడ వడపోత తర్వాత తిరిగి గ్రామ సభకు పంపిన అనంతరం ప్రాధాన్య క్రమంలో తుది జాబితా తయారు చేస్తారని వివరించారు. అనంతరం ఇళ్ల సంఖ్యను బట్టి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వివరించారు. అర్హుల ఎంపికలో ఎవరి జోక్యం ఉండదని, పూర్తిగా గ్రామ సభ ద్వారానే బహిరంగంగా ఎంపిక జరుగుతుండటంతో ఎవరికీ అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. 

రిజర్వేషన్ల ప్రకారమే కేటాయింపులు 
డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్లు పాటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయిస్తామన్నారు. మిగతా ఇళ్లను ఇతర లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం ఎస్సీలకు 15.45 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 17 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా కుత్భుల్లాపూర్‌లో 12 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కాలనీల్లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement