దర్జాగా కబ్జా!

pond land illegally taken in tharoor - Sakshi

శిఖం భూమిలో పంటల సాగు

ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్న ఆక్రమణదారులు

ఆందోళనలో ఆయకట్టు రైతులు

ధారూరు : ఆ చెరువులో రూ.40 లక్షలతో మిషన్‌ కాకతీయ పథకం కింద పునరుద్ధరణ పనులు చేశారు. సాగునీరు అందించేందుకు అభివృద్ధి చేసిన చెరువును కొంతమంది దర్జాగా ఆక్రమించి ఇందులో పంటలను సాగుచేశారు. తూము సమీపంలో నీరు నిల్వ ఉన్న 10 శాతం చెరువు భాగాన్ని మాత్రమే వదిలివేసి మిగిలిన చెరువు విస్తీర్ణంలో వరి, జొన్న పంటలు వేశారు. పూడిక తీసిన చెరువులో ఓ వ్యక్తి పశువుల కొట్టం ఏర్పాటు చేసి పశుగ్రాసం నిల్వ చేశాడు. ఆదివారం గ్రామానికి వెళ్లిన విలేకరుల బృందానికి ఆయకట్టు రైతులు చెరువు కబ్జాపై వివరించారు. వివరాలిలా ఉన్నాయి.. ధారూరు మండలంలోని గురుదోట్ల కొత్త చెరువుకు 14.01 ఎకరాల విస్తీర్ణం ఉంది. 1968లో దీన్ని నిర్మించారు. గత సంవత్సరం మిషన్‌ కాకతీయ పథకం కింద ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో చెరువులో పూడికతీత, తూము నిర్మాణం, కట్ట, కాల్వ పనులను చేశారు. ఇటీవల గురుదోట్ల పంచాయతి పరిధిలోని కొంతమంది చెరువులోని 90 శాతం భూమిని ఆక్రమించారు. ఇందులో వరి పంట సాగుచేసేందుకు పక్క పొలాల్లోని బోర్ల నుంచి పైప్‌లైన్ల్‌ ద్వారా నీటిని చెరువులోకి మళ్లించారు.

సాగునీరు అందించే ఈ చెరువు రూపం మారిపోయి పొలాలుగా కనిపిస్తోంది. చెరువును ఆక్రమించి పంటలను సాగుచేయటం వలన ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. చెరువు కింద ఉన్న కాల్వను కూడ ఆక్రమణదారులు పాడుచేశారు. వర్షాకాలంలో చెరువులోకి నీరు రాకుండా, చెరువు నిండాకుండా చెరువులోకి వచ్చే వాగు ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో చెరువు కింద ఉన్న 100 ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. కొంతమంది రైతులు బోర్లు వేసుకుని వాటిద్వారా పంటలు పండించుకుంటున్నారు. చెరువు కబ్జాపై ప్రశ్నించిన ఆయకట్టుదారులను ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

చెరువు చుట్టూ కందకాలు తవ్వించాలి
 కొంత మంది చెరువును ఆక్రమించి పంటలు వేసుకోవడం అన్యాయం. ఆక్రమణకు గురైన చెరువును కబ్జా నుంచి విడిపించి హద్దురాళ్ల చుట్టూ కందకాలను తవ్వించాలి. చెరువును కబ్జాచేసి పంటలు వేయటం వలన చెరువులోకి వర్షపు నీరు రాకుండా పోయింది. మా పొలాలకు సాగునీరు అందడం లేదు. – కొంకలి వెంకటమ్మ

సర్వే చేస్తాం
ఆక్రమణకు గురైన చెరువును సర్వే చేయించి వాస్తవాలను గుర్తిస్తాం. ఆక్రమణ బయటపడితే సదరు వ్యక్తులను ఖాళీ చేయించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సాగునీటి శాఖ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి విచారణ జరుపుతాం.  – యాదయ్య, ఆర్‌

ఆక్రమణపై విచారణ చేస్తాం
గురుదోట్ల చెరువును ఆక్రమించిన విషయం మా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలిస్తాం. సర్వే నిర్వహించి ఆక్రమణను గుర్తిస్తాం. చెరువును ఆక్రమించి పంటలు సాగుచేసుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం.– సుకుమార్, ఏఈ ఇరిగేషన్, ధారూరు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top