రాజకీయ సంస్కరణలు చేపట్టాలి

Political reforms should be taken - Sakshi

రాష్ట్రపతిని కలిసిన బీసీ సంఘం నేతలు

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య రాష్ట్రపతిని కోరారు. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతితో వారు 35 నిమిషాలపాటు చర్చించారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కలేదని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు రాజకీయ రంగంలో 14 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం, వ్యాపార రంగంలో కేవలం ఒక శాతం వాటా మాత్రమే బీసీలకు ఉందని, రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రకారం మౌళికమైన మార్పులకోసం చర్యలు తీసుకోవాలని నేతలు రాష్ట్రపతిని కోరారు.

పార్లమెంటు, శాసనసభలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని, పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50 శాతం వాటా కల్పించాలనే తదితర 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిం చారు. 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై తన వంతు ప్రయత్నం చేస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య మీడియాకు తెలిపారు. రాష్ట్రపతిని కలిసినవారిలో ఆంధ్రప్రదేశ్‌ పొలిటికల్‌ జేఏసీ నేత నౌడు వెంకటరమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయకార్యదర్శి గుజ్జ కృష్ణ, భూపేశ్‌కుమార్, హరికిషన్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top