పోలీసుల అత్యుత్సాహం! | Police Department Over Action On Media And Doctors | Sakshi
Sakshi News home page

పోలీసుల అత్యుత్సాహం!

Mar 25 2020 2:44 AM | Updated on Mar 25 2020 2:44 AM

Police Department Over Action On Media And Doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మంగళవారం 33 జిల్లాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సోమవారం రాత్రి నుంచి పోలీసులు రోడ్డు మీదకు ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897 అమలులో ఉండటంతో అకారణంగా రోడ్లమీదకు వచ్చినవారిపై లాఠీలు ఝుళిపించారు. ఇదే క్రమంలో పోలీసులు పలుచోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. రాత్రి 7 గంటల తరువాత రోడ్ల మీదకు వచ్చిన వైద్యులు, విలేకరులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. పలువురి ద్విచక్ర వాహనాలను లాఠీలతో ధ్వంసం చేశారు. జీవో నం.45 ప్రకారం తమకు అనుమతి ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా లాఠీలతో చెలరేగిపోయారు. సోమవారం రాత్రి రామంతాపూర్‌ వద్ద పలు పత్రికలకు చెందిన సీనియర్‌ పాత్రికేయులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం కలకలం రేపింది.

ఈ విషయంలో పోలీసుల తీరుపై విలేకరులు, వైద్యులు తీవ్ర నిరసన తెలిపారు. తామూ అత్యవసర విధులు నిర్వర్తిస్తున్నామని, పోలీసులు దాడులు చేసి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్, సూర్యాపేట ఖమ్మంలో పలుచోట్ల మహిళా వైద్యులు, స్టాఫ్‌ నర్సులపైనా పోలీసులు చేయిచేసుకోవడం వైద్య సిబ్బందిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనిపై పలువురు వైద్యులు మంత్రి కేటీఆర్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రాణాలకు తెగించి, రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రి పగలు సేవలందిస్తున్న తమపై పోలీసులు లాఠీలతో దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

చర్యలకు డీజీపీ హామీ..
రామంతాపూర్‌లో పోలీసుల అత్యుత్సా హంపై పలువురు సీనియర్‌ పాత్రికేయులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు అత్యవసర సేవా విభాగంలోకి వస్తారని, వారిని అడ్డుకోరాదని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో మీడియా, పోలీసులు, వైద్యులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఇందుకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై పోలీసుల అత్యుత్సాహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. మరోవైపు పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటికి రానీయలేదు. నిబంధనలను ఉల్లంఘించిన పలువురిపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897 ప్రకారం.. కేసులు నమోదు చేశారు. వందలాది వాహనాలు సీజ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement