నేర రహిత పోలీస్‌ కమిషనరేట్‌ లక్ష్యం

 Police Commissioner Dr Ravinder Speaks about Crime Warangal - Sakshi

 న్యూశాయంపేటలో కార్డన్‌ సెర్చ్‌లో సీపీ రవీందర్‌

150 మంది సిబ్బందితో న్యూశాయంపేట దిగ్బంధం

40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

సాక్షి, కాజీపేట అర్బన్‌:  వరంగల్‌ కమిషనరేట్‌ను నేర రహితంగా  తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు. హన్మకొండ డివిజనల్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కాజీపేట మండలంలోని న్యూశాయంపేటలో 150 మంది సిబ్బందితో కార్డన్‌ సర్చ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సీపీ రవీందర్‌ న్యూ శాయంపేట ప్రజలతో మాట్లాడి పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. తొలుత న్యూశాయంపేటలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీ రవీందర్‌ మాట్లాడారు. శాంతి భద్రతల పరీరక్షణలో ప్రజలకు భరోసా అందించేందుకు కార్డన్‌ సర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. నేరాల నివారణకు పోలీసుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్డన్‌ సర్చ్‌లో నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 45 మంది నేరస్తులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ప్రశాంతమైన జీవనాన్ని, పూర్తి భద్రత కలిగించేందుకు  24 గంటల పెట్రోలింగ్, నిరంతర నిఘాకు గస్తీ వాహానాలు, బ్లూకోట్స్‌ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఫేస్‌ రికగ్నైజింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో నేరస్తులను ఫింగర్‌ స్కానర్‌ సాయంతో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్డన్‌ సర్చ్‌లో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, ఇన్‌స్పెక్టర్‌ సదయ్య, సంపత్‌రావు, రాఘవేందర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top