
జనగామ: అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపధ్యంలో శనివారం తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజేఏసి జిల్లా చైర్మన్ ఆకుల సతీష్ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్‌పూర్, రఘునాధపల్లి, స్టేషన్ ఘన్ పూర్ పోలీస్టేషన్లకు తరలించారు.
జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్ ఫై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు.