రూపాయిన్నర కోసం లొల్లి | Sales stalled for two days at IKP purchasing center: Jangaon | Sakshi
Sakshi News home page

రూపాయిన్నర కోసం లొల్లి

Apr 11 2025 4:34 AM | Updated on Apr 11 2025 4:34 AM

Sales stalled for two days at IKP purchasing center: Jangaon

చర్చలు జరుపుతున్న ఏఎంసీ చైర్మన్, అధికారులు

ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రెండు రోజులుగా నిలిచిన విక్రయాలు

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌ కాటన్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రూ.1.50 (రూపాయిన్నర) లొల్లితో రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని బస్తాలో నింపి కాంటా వేసిన తర్వాత లారీలో లోడ్‌ చేసినందుకు హమాలీలకు రైతులు క్వింటాకు రూ.80 చెల్లిస్తున్నారు.

అయితే లారీ కాంట్రాక్టర్‌ నుంచి బస్తాకు రూ. 1.50 పైసలు ఇవ్వాలని హమాలీలు డిమాండ్‌ చేస్తుండగా.. ససేమిరా అనడంతో రెండు రోజు­లుగా కాంటా నిలిచి పోయింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్, సివిల్‌ సప్లయిస్‌ డీఎం హతీరామ్, మార్కెటింగ్‌ మేనేజర్‌ నరేంద్ర, పౌర సరఫరాల శాఖ నాయబ్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ లారీ కాంట్రాక్టర్, హమాలీలతో చర్చలు జరిపారు.

అయినా రూ.1.50 పైసలు ఇచ్చేందుకు సదరు కాంట్రాక్టర్‌ ఒప్పుకోలేదు. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ సెంటర్లలో క్వింటా ధాన్యం కాంటా వేసి, లోడ్‌ చేస్తే రూ.60 ఉండగా, ఇక్కడ మాత్రం రూ.80 ఇస్తున్నారని, సర్దుకు పోవా­లని హమాలీలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య గురువారం రాత్రి వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement