ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు

People Sufering With Heavy Traffic in LB Nagar Xroads - Sakshi

ఇంకోవైపు తీవ్రమైన ట్రాఫిక్‌   

కిక్కిరిసిపోతున్న ఎల్‌బీనగర్‌ చౌరస్తా  

ఇక సెలవుల్లో మరిన్ని కష్టాలు  

ఇరుకైన రోడ్లు, బస్‌బేలు లేకపోవడంతో సమస్యలు

ఎల్‌బీనగర్‌: ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ జనసంద్రంగా మారుతోంది. ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు.. ఇంకోవైపు ఇతర వాహనాలతో ఈ చౌరస్తా కిక్కిరిసిపోతోంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతిరోజు 800–900 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.ఇవికాకుండా మరో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ ప్రాంతమంతా రద్దీగా మారుతోంది. రోజూ సుమారు 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు 150, ఆంధ్రప్రదేశ్‌ బస్సులు 350, ప్రైవేట్‌ బస్సులు 400, కార్లు సహా ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ స్థాయిలో  వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వరుస సెలవులు వస్తే చాలు... ఇక్కడ నిల్చొనేందుకు కూడా చోటు దొరకడం లేదు.  

బస్సు ఆగేదెలా?  
ఈ చౌరస్తా నుంచి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా... వాటిని నిలిపేందుకు స్థలం కరువైంది. అధికారులు ఎక్కడా బస్‌బేలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే బస్సులను నిలపాల్సి వస్తోంది. ఇక ఇతర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ఇక్కడ అండర్‌పాస్‌లు, ప్లైఓవర్‌ బ్రిడ్జీల నిర్మాణంతో రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది.

విస్తరణేదీ?   
ఎల్‌బీనగర్‌ నాలుగు రహదారులకు జంక్షన్‌. ఉప్పల్, బెంగళూర్‌ హైవే, సాగర్‌ రింగ్‌రోడ్డు, నగరానికి వెళ్లాలన్న ఈ చౌరస్తా దాటాల్సిందే. ఓవైపు రోడ్ల పనులు జరుగుతుండడం, మరోవైపు జంక్షన్‌ విస్తరించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు కనీసం పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్లపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రోజూ గొడవలే..
ట్రాఫిక్‌ సమస్యతో ఈ రూట్లో రోజూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఒక్కోసారి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ఇతర వాహనదారులతో ఘర్షణలకు సైతం దిగుతున్నారు. పక్కపక్కనుంచే వాహనాలు వెళ్లాల్సి రావడం, ఒక దానికి మరోటి వాహనం తగులుతుండడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి.  

ఎక్కడ ఆగుతుందో?  
ఎల్‌బీనగర్‌ చౌరస్తా వద్ద బస్సులు ఎక్కడ ఆగేది తెలియడంల లేదు. బస్సు వచ్చిందంటే చాలు అది ఎక్కడికి పోతుందోనని ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బస్టాప్‌ అనేది లేకపోవడంతో ఇబ్బందిగా మారింది.  – కుమార్, ప్రయాణికుడు

రోజూ జంక్షన్‌ జామ్‌ ఇలా...
బస్సులు 800-900  
కార్లు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో
ప్రయాణికులు 2లక్షలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top