కొత్త పట్టా పుస్తకాలెప్పుడో! 

People Requesting For New Passbooks In Adilabad - Sakshi

కలెక్టర్‌ ఆదేశించిన పంపిణీ కాని పట్టాలు  

రైతుబంధు, పంట రుణాలకు దూరం      

సాక్షి, ఆదిలాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుంది. అయినా ఇంత వరకు వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు లేని భూములను పార్ట్‌–ఏలో చేర్చి కొత్త పట్టాపాసు పుస్తకాలు అందించారు. వివాదాలు ఉన్న భూములను పార్ట్‌–బిలో చేర్చి ఇంత వరకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేయలేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తహసీల్దార్‌ కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.  

మూడు ఎకరాలకుపైనే..  
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను పరిశీలించిన అధికారులు సర్వే లో వివాదాలు ఉన్న భూములను పార్ట్‌–బీలో చే ర్చారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరిగి ఇరవై నెలలు గడుస్తున్నా..పార్ట్‌–బీ భూములకు ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదు. దీంతో ఆ భూములు కలిగిన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నియోజకవర్గంలో 5400 ఎకరాలపైగా భూములను పార్ట్‌–బీలో చేర్చగా, గతేడాది నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల భూములకు మాత్రమే పరిష్కర మార్గం చూ పారు. మిగతా 3,400 ఎకరాలకు మోక్షం కలగలేదు. పార్ట్‌–బీలోని భూములన్నింటీకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెడుతూ వస్తోంది. గత ఎనిమిది నెలలుగా వరుస ఎన్నికల నేపథ్యం లో పార్ట్‌–బీ భూ సమస్యల జోలికి అధికారులు వెళ్లలేదు.  

మోక్షం లభించేనా?  
నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్‌ రూరల్, అర్బన్, మావల మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని సుమారు 3400 ఎకరాలకుపైగా భూములు పార్ట్‌–బీలో పెండింగ్‌లో ఉం ది. వీటకి పూర్తిస్థాయి పరిష్కరం లభించే అవకాశం కనిపించడం లేదు. కోర్టుకేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూములను అధికారులు పక్కనపెట్టగా, చిన్న చిన్న సమస్యలున్న భూములను మాత్రమే పరిశీలన చేసి పరిష్కరిస్తున్నారు.

దీంతో అసలు సమస్య ఉన్న భూములు పెండింగ్‌లో నే ఉన్నాయి. అయితే కొన్ని భూములకు చిన్న స మస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని, కలెక్టర్‌ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఓసారి దృష్టి సారిస్తే.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పార్ట్‌–బీలోని కొన్ని భూములపై రెవెన్యూ, సివిల్‌ కోర్టు కేసులు, సరిహద్దు గుర్తింపు సమస్యలున్నాయి.

పాసు పుస్తకం ఇవ్వాలి  
నా పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. పాత పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. కానీ కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇంత వరకు ఇవ్వలేదు. చాలాసార్లు అధికారులను అడిగినా.. ఇంత వరకు జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నాం
– ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్‌     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top