
పెన్షన్.. నో టెన్షన్
‘‘ఆసరా పథకం అమలులో ఆందోళన వద్దు. అర్హులందరికీ పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామ స్థాయిలో వచ్చిన పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.
ముకరంపుర : ‘‘ఆసరా పథకం అమలులో ఆందోళన వద్దు. అర్హులందరికీ పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామ స్థాయిలో వచ్చిన పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. పట్టణాలు, నగరాల్లో పూర్తికావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,80,126 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించాం. నగరాలు, పట్టణాల్లో నాలుగు రోజుల్లో తుది జాబితా సిద్ధం కానుంది.
ఈనెల 15లోగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విచారణ, కంప్యూటరీకరణ పూర్తి చేసి అర్హుల గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కసరత్తు చేస్తున్నాం. సాంకేతిక లోపాల వల్ల పింఛన్లు రాని వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హతలున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..’’ అని డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్ ‘సాక్షి’తో వివరించారు.
కచ్చితమైన అర్హులను గుర్తిస్తున్నాం...
జిల్లాలో గతంలో అన్ని పింఛన్లు కలిపి 3,56,692 ఉండేవి. ఇటీవల పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచిన ప్రభుత్వం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అర్జీలు స్వీకరిం చాం. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అర్హులు, అనర్హుల నుంచి దరఖాస్తులు రావడంతో నిబంధనల ప్రకారం కచ్చితమైన అర్హులను గుర్తిస్తున్నాం.
ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో సీలింగ్ రిజర్వేషన్ ప్రకారమే లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా నిజనిర్దారణ సర్టిఫికెట్లు కలిగిన అర్హులను గుర్తించాం. ప్రతి గ్రామంలో వృద్ధులు 5శాతం, వితంతువులు 5శాతం, వికలాంగులు 3శాతానికి మించకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలున్నాయి.
గ్రామంలో వివిధ కేటగిరీల జనాభాను అనుసరించి ఎస్సీలు 80శాతం, ఎస్టీలు 75శాతం, బీసీలు 50శాతం, ఓసీలు 20శాతం మేర పింఛన్లు పొందేందుకు అర్హులుగా నిర్ణయిం చారు. క్షేత్రస్థాయిలో నిబంధనలు అనుకూలించకపోయినా అరులను గుర్తిస్తున్నాం.
5,57,057 దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా పింఛన్ల కోసం 5,57,057 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో వచ్చిన 4,73,487 దరఖాస్తుల విచారణ, కంప్యూటరీకరణ దాదాపు పూర్తయ్యింది. పట్టణ, నగర ప్రాంతంలో వచ్చిన 83,570 దరఖాస్తులపై విచారణ, కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో 2,71,875 మందిని, పట్టణ ప్రాంతంలో 8751 మందిని కంప్యూటరీకరించి అర్హులుగా గుర్తించాం.
పట్టణ ప్రాంతాల్లో విచారణ అనంతరం జిల్లావ్యాప్తంగా పింఛన్ లబ్దిదారుల సంఖ్య 3.10 లక్షలకు చేరే అవకాశాలున్నాయి. గతంలోని 3,56,692 మంది పెన్షన్ లబ్దిదారుల్లో అభయహస్తం పింఛనుదారులు 41,780 మంది, బోగస్ వికలాంగులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ కొంతమందిని మినహాయిస్తే ఇప్పుడు అర్హులయ్యే వారి సంఖ్య ఇంచుమించు అంతే ఉంటుందేమో..
మరోసారి దరఖాస్తుకు అవకాశం..
లబ్దిదారుల జాబితాను ఈనెల 15లోగా సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నాం. సమగ్ర సర్వేలో నమోదు కానివారు, తప్పుడు సమాచారం ఇచ్చినవారు, ఆధార్‌కార్డు లేనివారు, డాటాఎంట్రీలో తప్పుగా నమోదైన వారిని పునఃపరిశీలించి అర్హులుగా గుర్తించనున్నాం.
జాబితాలో పేరులేని అర్హులు తిరిగి ఆర్డీవోలు, ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికి తేదీలు ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. పింఛన్ రాలేదని దరఖాస్తు చేసినవారందరి నుంచీ స్వీకరిస్తాం. అవసరమైతే ఐకేపీ సిబ్బందితో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు న్యాయం చేస్తాం.
రూ.23.86 కోట్ల అదనపు భారం
గత ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.200, వికలాంగులకు రూ.500 పింఛన్ ఇచ్చాయి. తెలంగాణ ప్రభ/త్వం ప్రకటించినట్లుగా ఈ పింఛన్లను రూ.1000, రూ.1500కు పెంచింది. ఇప్పటిదాకా ప్రతినెల పింఛన్ల రూపంలో నెలకు రూ.9.10 కోట్లు చెల్లించేవారు. ఇకపై ప్రతినెల రూ.32.96 కోట్లు చెల్లించనున్నారు. ఈ లెక్కన గతంతో పోలిస్తే ప్రభుత్వంపై ప్రతినెల రూ.23.86 కోట్ల అదనపు భారం పడుతోంది.
సమగ్ర సర్వేలో కుటుంబాల సంఖ్య 12,35,851
గతంలో పింఛన్ల లబ్దిదారులు 3,56,692
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 5,57,057
ఇప్పటివరకు అర్హులుగా గుర్తించినవి 2,80,026
పూర్తిస్థాయి విచారణ అనంతరం పెరిగేవి 25,000