బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకోవచ్చు | Sakshi
Sakshi News home page

బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకోవచ్చు

Published Sun, May 5 2019 1:37 AM

Now Change Train Boarding Point Through Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు మరో సదుపాయాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బయలుదేరవలసిన స్టేషన్‌ (బోర్డింగ్‌ పాయింట్‌)ను ఇక నుంచి ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఇప్పటివరకు రైల్వేస్టేషన్‌ల్లో మాత్రమే బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇటీవల దీనిని ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులు ట్రైన్‌ బయలుదేరే సమయానికి 24 గంటల ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా బోర్డింగ్‌ పాయింట్‌ను మార్చుకోవచ్చు. అయితే ఇది నిర్ధారిత (కన్ఫర్మ్‌డ్‌) టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న టికెట్లకు ఈ సదుపాయం ఉండదు. ఒకసారి బోర్డింగ్‌ పాయింట్‌ను మార్చుకున్న తరువాత తిరిగి అదే బోర్డింగ్‌ పాయింట్‌ నుంచి ప్రయాణం చేసేందుకు అవకాశం కూడా ఇవ్వరు.

ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మొదట సికింద్రాబాద్‌ను బోర్డింగ్‌ పాయింట్‌గా ఎంపిక చేసుకొని తరువాత కాజీపేట్‌కు మార్చుకున్న వాళ్లు అక్కడే రైలు ఎక్కాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో ఎక్కేందుకు అవకాశం ఉండదు. బోర్డింగ్‌ పాయింట్‌ మార్పుతో సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ వరకు (అప్పటికే చార్జీలు చెల్లించి ఉన్నప్పటికీ) ప్రయాణం చేసేందుకు అనుమతించరు. ఆ రెండు స్టేషన్‌ల మధ్య వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులకు అవకాశాన్ని కల్పిస్తారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బెర్తుల లభ్యతకు అనుగుణంగా బోర్డింగ్‌ను మార్చుకునేందుకు ఆన్‌లైన్‌ సదుపాయం ఒక వెసులుబాటు కల్పిస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేప్రయాణికుల్లో సుమారు 10 శాతం నుంచి 12 శాతం వరకు ప్రతి రోజు బోర్డింగ్‌ పాయింట్‌ మార్పునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ మార్పు సదుపాయం స్టేషన్‌లు, రిజర్వేషన్‌ కార్యాలయాల్లో మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందిగానే ఉండేది. ఆన్‌లైన్‌ మార్పు వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లైంది. 

వెయిటింగ్‌లిస్టు ప్రయాణికులకు అవకాశం... 
మరోవైపు నిర్ధారిత టికెట్లపైన బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకోవడంతో ఆ రెండు స్టేషన్‌ల మధ్య ప్రయాణం కోసం వెయిటింగ్‌లో ఉన్న వాళ్లకు అవకాశం లభిస్తుంది. వికల్ప్‌ పథకం కింద టికెట్లు బుక్‌ చేసుకొని వెయిటింగ్‌లో ఉన్న వాళ్లకు తాము బుక్‌ చేసుకున్న ట్రైన్‌లో బెర్తులు లభించకపోయినా ఆ తరువాత వచ్చే రైళ్లలో ఇలాంటి బోర్డింగ్‌ మార్పుతో బెర్తులు లభించే అవకాశం ఉంది. ఇది ఇటు నిర్ధారిత టిక్కెట్‌ ప్రయాణికులకు, అటు వెయిటింగ్‌ లిస్టు వారికి ప్రయోజనకరం. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తేవడంతో ఎక్కువ మంది వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement